న్యూఢిల్లీ, వెలుగు: చలికాలంలో చల్లని గాలుల నుంచి నిరాశ్రయులు, వృద్ధులు, భిక్షాటన చేస్తున్న వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణతో పాటు 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆదేశించింది. పేదలు, నిరాశ్రయులు, వృద్ధులు, నవజాత శిశువులు, పిల్లలపై వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయని పేర్కొంది. అందువల్ల వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గురువారం ఎన్‌హెచ్‌ఆర్సీ విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తావించింది.
2019 నుంచి 2023 మధ్య దేశంలో శీతాకాల గాలుల వల్ల దాదాపు 3,639 మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రిపోర్ట్ చెబుతోందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మరణాలను తగ్గించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గైడ్ లైన్స్ అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇందులో భాగంగా నిరాశ్రయులకు 24 గంటలు షెల్టర్లను ఏర్పాటు చేయాలని, జలుబు సంబంధిత వ్యాధులకు చికిత్స అందించాలని స్పష్టం చేసింది. అధికారులు చేపట్టిన చర్యలను రిపోర్ట్ ద్వారా అందించాలని రాష్ట్రాలు/యూటీలకు ఆదేశాలు జారీ చేసింది
