కేరళలో పీఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ అరెస్ట్

కేరళలో పీఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ అరెస్ట్

కేరళలో పీఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పాలక్కాడ్ జిల్లాలోని అతని ఇంటి దగ్గర రవూఫ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వం PFIను బ్యాన్ చేసినప్పటి నుంచి రవూఫ్ పరారీలో ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి కేరళ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు పరారీలో ఉన్న రవూఫ్ కోసం వెతుకుతున్నారు. అయితే నిన్న రాత్రి అతని ఇంట్లో అధికారులకు రవూఫ్ పట్టుబడ్డాడు. రవూఫ్ ను ఎన్ఐఏ ఆఫీస్ కు తరలించి అధికారులు విచారణ చేస్తున్నారు. 

గత నెలలో  దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ ప్రాంగణాలపై దాడి చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ... అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను అరెస్టు చేసింది. దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత కేంద్రం దీనిపై 5ఏళ్ల పాటు నిషేధం ప్రకటించింది. అయితే అప్పట్లో రవూఫ్‌ను పట్టుకోలేక ఎన్‌ఐఏ అతడిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలపై దాడులపై జరిగిన అరెస్టులకు నిరసనగా సెప్టెంబర్ 23న కేరళలో హర్తాళ్‌కు పిలుపునిచ్చిన నాయకులలో రవూఫ్ కూడా ఉన్నారు. హర్తాళ్ సందర్భంగా అప్పట్లో కేరళలో పెద్దఎత్తున హింస కూడా చెలరేగింది. హర్తాళ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన తర్వాత, హింసకు సంబంధించి 1,500 మంది పీఎఫ్‌ఐ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.