V6 News

ILT20 2025-26: ఫిక్సింగ్ కాదు.. హై డ్రామా: కావాలనే స్టంపింగ్ మిస్ చేసిన పూరన్.. ప్రత్యర్థి కూడా ఊహించని ఝలక్

ILT20 2025-26: ఫిక్సింగ్ కాదు.. హై డ్రామా: కావాలనే స్టంపింగ్ మిస్ చేసిన పూరన్.. ప్రత్యర్థి కూడా ఊహించని ఝలక్

బ్యాటర్ ను ఔట్ చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. క్రీజ్ లో పాతుకుపోయిన ప్లేయర్ ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి జట్టు చాలానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవాలనుకోదు. కానీ ఇంటర్నేషనల్ టీ20లో భాగంగా ఒక షాకింగ్ సంఘటన జరిగింది. వికెట్ కీపర్ నికోలస్ పూరన్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డెన్ ను ఔట్ చేసే అవకాశం ఉన్నపటికీ స్టంపింగ్ చేయాలనుకోలేదు. పూరన్ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీడాస్ఫూర్తి విరుద్ధంగా స్టంపింగ్ మిస్ చేశాడని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. 

ఇంటర్నేషనల్ టీ20లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) ఎంఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో  డెసర్ట్ వైపర్స్ మొదట బ్యాటింగ్ చేస్తుండగా రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 16 ఓవర్ ఐదో బంతిని రషీద్ ఖాన్ బ్యాటర్ కు దూరంగా విసిరాడు. హోల్డెన్ ముందుకు రావడం గమనించి స్టంప్స్ కు దూరంగా విసిరాడు. హోల్డెన్ ముందుకు వచ్చి ఆడగా.. బాల్ మిస్ అయింది. ఈ సమయంలో వికెట్ కీపర్ పూరన్ ఔట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ హోల్డెన్ వైపు  చూస్తూ అలా ఉండిపోయాడు.
 
పూరన్ స్టంపింగ్ మిస్ చేయడంతో హోల్డెన్ బ్యాట్ క్రీజ్ లో పెట్టాడు. ఇది చూసిన వారు పూరన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. అయితే అసలు విషయం ఏంటనే క్రీజ్ లో ఉన్న హోల్డెన్ స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవుతున్నాడు. వేగంగా పరుగులు చేయడంలో తడబడ్డాడు. 37 బంతుల్లో కేవలం 42 పరుగులు చేసి జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు. దీంతో హోల్డెన్ ఔటయ్యే అవకాశం ఉన్నప్పటికీ పూరన్ అతన్ని క్రీజ్ లో ఉంచే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలోనే ఇక్కడ ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. హోల్డెన్ ను రిటైర్డ్ ఔట్ అవ్వాలని కోరడంతో అతను పెవిలియన్ కి వెళ్ళిపోయాడు. 

హై డ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే డెజర్ట్ వైపర్స్ 1 పరుగు తేడాతో ఎంఐ ఎమిరేట్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన డెజర్ట్ వైపర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మ్యాక్స్ హోల్డెన్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఛేజింగ్ లో ఎంఐ ఎమిరేట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది.