ముంబై: యూఎస్ ఫెడరల్ బ్యాంక్ పాలసీ నిర్ణయం ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెంచింది. వడ్డీ రేట్లను మార్చకుండా 5.25 శాతం – 5.50 శాతం దగ్గరే కొనసాగించిన ఫెడ్, ఈ ఏడాది మూడు సార్లు రేట్ల కోత ఉంటుందని ప్రకటించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్లు కూడా గురువారం లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 591 పాయింట్లు (0.82 శాతం) పెరిగి 72,692 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ 176 పాయింట్లు లాభపడి 22,015 దగ్గర ముగిసింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్, డాలర్ ఇండెక్స్ దిగిరావడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు పాజిటివ్‌గా కదిలాయి.
నిఫ్టీ రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు గ్రీన్‌లో క్లోజయ్యాయి. బ్రాడ్ మార్కెట్ చూస్తే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ మరికొన్ని సెషన్ల పాటు కన్సాలిడేట్ అవ్వొచ్చని, 22,200 పైన మార్కెట్ ర్యాలీ ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అంచనా వేశారు. స్టాక్‌ను బట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్లాన్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. గ్లోబల్ మార్కెట్లలో జపాన్ నికాయ్ గురువారం ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.
బీఓఈ వడ్డీ రేటు మార్చలే..
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బీఓఈ) వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుతున్నా, ఇంకా గరిష్ట స్థాయిల్లోనే ఉండడంతో కీలక రేటును 5.25 శాతం దగ్గరే కొనసాగించింది. వడ్డీ రేట్లను ఇప్పటిలో తగ్గించే ఆలోచన లేదని బీఓఐ ప్రకటించింది.
స్విస్ సర్‌ప్రైజ్..
స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ గురువారం మార్కెట్‌లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కీలక వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 1.5 శాతానికి దిగొచ్చింది. వడ్డీ రేట్లను తగ్గించిన మొదటి పెద్ద ఎకానమీగా స్విట్జర్లాండ్ నిలిచింది.
