ఫార్మా సైంటిస్ట్​ను ట్రాప్​ చేసిన నైజీరియన్​ గ్యాంగ్​

ఫార్మా సైంటిస్ట్​ను ట్రాప్​ చేసిన నైజీరియన్​ గ్యాంగ్​
  • నల్లేరు మొక్కలు కావాలని 
  • 87 లక్షలు కొట్టేసిన నిందితులు
  • ముంబయి అడ్డాగా మోసం.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: మెడిసన్ తయారీకి నల్లేరు మొక్కలు కావాలని ఓ ఫార్మా సైంటిస్టును నమ్మించి డబ్బులు కొట్టేసిన నైజీరియన్ గ్యాంగ్​కు చెందిన నలుగురిని సిటీ సైబర్ ​క్రైమ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, డీసీపీ స్నేహా మెహ్రా శుక్రవారం వివరాలు వెల్లడించారు. తార్నాకకు చెందిన ఓ ఫార్మా సైంటిస్ట్‌‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో డాక్టర్ ఆర్థర్ విలియమ్స్ పేరుతో ఓ మెయిల్ వచ్చింది. క్రిస్టోఫర్‌‌ పేరుతో ఓ వ్యక్తి ఫార్మా సైంటిస్టుతో చాటింగ్ చేశాడు. తాను యూఎస్​కు చెందిన లెక్సో ఫార్మా కంపెనీ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు.

సిస్సస్ పాపుల్నియా(నల్లేరు) మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ఉందని.. తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ఇండియా నుంచి ఆ మొక్కల కాండాన్ని సప్లయ్ చేయాలని కోరాడు. తర్వాత  ఇందుకు సంబంధించిన డీలర్​ షిప్​ను ఇస్తానని నమ్మించాడు. ఇండియాలో సియా ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌ సంస్థ నల్లేరు మొక్కలను ఎగుమతి చేస్తోందని.. ఆ కంపెనీకి చెందిన మోనికశర్మ అనే యువతిని కలిసి ఆమె దగ్గర శాంపిల్స్ కొని తమకు పంపాలని సైంటిస్టుతో చెప్పాడు. 

ఒక మొక్క.. రూ.48 వేలు

కొన్నిరోజుల తర్వాత లెక్సో ఫార్మా కంపెనీకి మేనేజర్‌‌‌‌గా లారీ వైట్‌‌ అనే పేరుతో ఓ వ్యక్తి.. ఫార్మా సైంటిస్ట్‌‌ను ఆన్​లైన్​లో కాంటాక్ట్​అయ్యాడు. నల్లేరు మొక్కలను కొని ఢిల్లీలో ఉండే ఆఫ్రికన్​డానీకి ఇవ్వాలన్నాడు. దీంతో ఫార్మా సైంటిస్ట్.. సియా ఎంటర్​ప్రైజెస్​కు చెందిన మోనికశర్మ నుంచి ఒక్కో నల్లేరు మొక్కను రూ.48 వేల చొప్పున మూడింటిని రూ.లక్షా 44 వేలు చెల్లించి కొన్నాడు. వీటిని ఢిల్లీలోని ఆఫ్రికన్ డానీకి అందించాడు. నల్లేరు మొక్కల కాండం క్వాలిటీ బాగుందని.. వీటిని లెక్సో కంపెనీకి సప్లయ్ చేసే డీలర్​షిప్​మీకే ఇస్తామని డానీ.. సైంటిస్టుతో చెప్పాడు. తర్వాత లెక్సో కంపెనీ కోసం 200 మొక్కలను ఆర్డర్ చేశాడు. దీంతో సదరు సైంటిస్ట్ సియా ఎంటర్​ప్రైజెస్​ నుంచి 200 మొక్కలను రూ.87 లక్షల 45 వేలకు కొన్నాడు. వాటిని లెక్సో కంపెనీకి సప్లయ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ, క్రిస్టోఫర్, లారీ వైట్, డానీ, మోనిక శర్మ ఇలా ఎవరికీ కాల్​చేసినా స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించిన సైంటిస్ట్.. సిటీ సైబర్​క్రైమ్​పోలీసులకు కంప్లయింట్ 
చేశాడు.

ఇట్ల దొరికిన్రు

కేసు ఫైల్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల  ఫోన్ నంబర్లు, బ్యాంక్​అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ముంబయిలో ఉండే నైజీరియన్ విన్సెంట్(37), షకీల్​(34), అరవింద్ మిశ్రా(45), సైఫుల్లాఖాన్ (53)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాబ్ టాప్, సెలఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  శుక్రవారం నిందితులను సిటీకి తీసుకొచ్చారు. ప్రధాన నిందితుడు క్రిస్టోఫర్ పరారీలో ఉన్నాడని.. అతడు నైజీరియా నుంచే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్​క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇలా ఫ్రాడ్ చేసి వసూలు చేసిన డబ్బును సియా ఎంటర్ ప్రైజెస్ అకౌంట్ నుంచి షకీల్, అరవింద్ విత్​డ్రా చేసి విన్సెంట్​కు అందజేస్తున్నారన్నారు.