
సనా: యెమెన్ పౌరుడి హత్య కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషా ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆమెకు విధించిన ఉరి శిక్షను యెమెన్ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, కాంతపురం ఏపీ అబూబక్కర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో సస్పెండ్ చేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేశారని.. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని యెమెన్ అధికారులు నిర్ణయించారని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. యెమెన్ ప్రభుత్వం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
కాగా, 2017లో యెమెన్‌లో జరిగిన హత్య కేసులో దోషిగా తేలిన నర్స్ నిమిషకు ప్రియకు 2020లో యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ మేరకు 2025, జూలై 16న ఆమెను ఉరి తీయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నిమిషా ప్రియ ఫ్యామిలీ, భారత ప్రభుత్వం, గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ అహ్మద్ సహా అనేక మంది మత పెద్దలు రంగంలోకి దిగి ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ యెమెన్ అధికారులతో చర్చలు జరిపారు.
చర్చలు సఫలం కావడంతో జూలై 16న పడాల్సిన ఉరి శిక్ష చివరి నిమిషంలో తాత్కలికంగా వాయిదా వేసింది యెమెన్ ప్రభుత్వం. అనంతరం ఉరిశిక్ష శాశ్వతంగా రద్దు చేసి.. నిమిషా ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్, కేంద్ర విదేశాంగ అధికారులు యెమెన్ అధికారులతో చర్చలు జరిపారు. అబూ బకర్, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న యెమెన్ ప్రభుత్వం.. నిమిష ప్రియ ఉరి శిక్షను రద్దు చేసేందుకు అంగీకరించింది. ప్రస్తుతం నిమిషా ప్రియ యెమెన్‌లోని సనా జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఉరిశిక్ష రద్దు చేసిన యెమెన్ ప్రభుత్వం దానిని యావజ్జీవ కారగార శిక్షగా మారుస్తుందా.. లేక జైలు నుంచి ఆమెను విడుదల చేసి ఇండియా పంపుతారా అన్నది తెలియాల్సి ఉంది.
కేసు ఏంటంటే..?
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన నిమిషా ప్రియా 2008లో యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా పని చేసింది. అనంతరం 2015లో సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే.. యెమన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమన్ జాతీయుడి భాగస్వామ్యం అవసరం. దీంతో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
2016లో మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహదీ ప్రియాపై వేధింపులకు దిగాడు. అంతేకాకుండా ప్రియా పాస్ట్ పోర్టు గుంజుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్ట్ పోర్టు తిరిగి తీసుకోవాలని భావించిన ప్రియా మరో వ్యక్తికితో కలిసి మహదీకి మత్తు మందు ఇచ్చింది. మత్తు మందు ఓవర్ డోస్ కావడంతో మహదీ మరణించాడు. దీంతో ప్రియా, ఆమెకు సహయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది.
2018లో ఈ కేసులో ప్రియాను దోషిగా తేల్చి 2020లో మరణ శిక్ష విధించింది యెమన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్. ఈ క్రమంలో ప్రియా యెమన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి కూడా ప్రియాకు ఉరి శిక్ష విధించడాన్ని ఆమోదించాడు. ఈ క్రమంలోనే 2025, జూలై 16న నిమిషను ఉరి తీసేందుకు యెమెన్ ప్రభుత్వం సిద్ధమైంది. కానీ భారత ప్రభుత్వ అధికారుల, అనేక మంది మతాధికారుల జోక్యంతో చివరి నిమిషంలో ఉరి శిక్ష రద్దు అయ్యింది.