తెలంగాణలో న్యాయ శాఖలో ఉన్నత పదవులు ఇవ్వాలి : నిమ్మ నారాయణ

తెలంగాణలో న్యాయ శాఖలో ఉన్నత పదవులు ఇవ్వాలి : నిమ్మ నారాయణ

ఖైరతాబాద్,వెలుగు : ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాష్ట్ర అడ్వకేట్​జనరల్ పదవికి ఎంపిక చేయాలని తెలంగాణ జడ్జెస్​అసోసియేషన్​ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ​జడ్జి నిమ్మ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ అడ్వకేట్స్​ ఫోరం ఆధ్వర్యంలో‘న్యాయవ్యవస్థలో మేమెంతో.. మాకంత’ అంశంపై శుక్రవారం సోమాజిగూడ  ప్రెస్​క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ​న్యాయశాఖలో ఉన్నత పదవులు కొందరినే వరిస్తున్నాయని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడ్వకేట్​జనరల్,అడిషనల్​అడ్వకేట్​జనరల్, పబ్లిక్ ​ప్రాసిక్యూటర్​లాంటి పదవులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి కేసీఆర్​బంధువులే న్యాయవ్యవస్థలో ఉన్నత పదవులు పొందారని ఆరోపించారు. 

ఇటీవల కొలిజియం సిఫార్సుతో జడ్జిల ఎంపికకు నలుగురి పేర్లను పంపారని, అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల పేర్లు లేవని పేర్కొన్నారు. ఆ ఎంపికను నిలిపివేసి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థుల పేర్లతో సిఫారసు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లాయర్ భీమారావు ​అధ్యక్షతన సమావేశం నిర్వహించగా.. ప్రొఫెసర్​ గాలి వినోద్​కుమార్, లాయర్లు భూమా గంగాధర్, దున్న అంబేద్కర్, మేకల కమలాకర్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.