- ఆల్ ఇండియా 2, 27, 40వ ర్యాంకులు కైవసం
హైదరాబాద్, వెలుగు: నీట్ సూపర్ స్పెషాలిటీ (నీట్ ఎస్ఎస్– 2025) ఫలితాల్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) జనరల్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. గత రెండేండ్లుగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన నిమ్స్ 2025వ సంవత్సరంలో కూడా అదే జోరును కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తాజా ఫలితాల్లో నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ సిద్దార్థ్ బి. రావు ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించగా.. డా. కె. తిరుమల బాబు (27వ ర్యాంకు), డా. శ్రీలేఖ్య (40వ ర్యాంకు), డా. సిద్దార్థ్ సాధ్నానీ(84వ ర్యాంకు) సహా పలువురు టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు.
ఈ రిజల్ట్స్ నిమ్స్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపాయని డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప హర్షం వ్యక్తం చేశారు. టాప్ ర్యాంకులే కాకుండా ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లోనూ నిమ్స్ స్టూడెంట్లు సీట్లు సాధించారు. బెస్ట్ అవుట్ గోయింగ్ రెసిడెంట్ గా గోల్డ్ మెడల్ పొందిన డా. సాయి విశాల్ ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో డీఎం మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీటును, డా. హర్షిత బెంగళూరులోని నిమ్హాన్స్లో డీఎం న్యూరాలజీ సీటును దక్కించుకున్నారు.
