
ఆస్పత్రిలో చేరిన తర్వాత ఒక్క రోజు గడిచే లోపే 9 నెలల చిన్నారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గురువారం ఉదయం జరిగింది. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ డైరెక్టర్ మోహన్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ముతైల్‌పేట్‌కు చెందిన 9 నెలల బాబును ఆ చిన్నారి కుటుంబసభ్యులు బుధవారం పాండిచ్చేరిలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. డయేరియాతో బాధపడుతున్న ఆ చిన్నారికి కరోనా ఉందేమోనన్న అనుమానంతో టెస్టు చేశామన్నారు. ఆ బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, కానీ ఆ పడివాడి ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. దీంతో పుదుచ్చేరిలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 22కి చేరినట్లు తెలిపారు. అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. తాజాగా పెరిగిన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,743కి చేరినట్లు తెలిపారు. కొత్త కేసుల్లో 128 పుదుచ్చేరిలో, 12 కరైకాల్, ఏడు కేసులు యానాం రీజియన్‌లో నమోదైనట్లు చెప్పారు. చిన్నారులు, వృద్దులకు కరోనా నుంచి ప్రమాదం ఎక్కువని, వారు అనవసరంగా బయటకు రాకూడదని సూచించారు మోహన్ కుమార్. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం టెస్టింగ్ కెపాసిటీ పెంచుతున్నామని, ప్రస్తుతం రోజుకు 1049 పరీక్షలు చేయగలుగుతున్నామని చెప్పారు.