
- 16,808 లావాదేవీల నమోదు
- వెల్లడించిన స్క్వేర్ యార్డ్స్
హైదరాబాద్, వెలుగు : నగరంలో ఇండ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో 16,808 లావాదేవీలు నమోదయ్యాయని స్క్వేర్ యార్డ్స్ తన రిపోర్టులో వెల్లడించింది. వీటి విలువ రూ.9,497 కోట్లు ఉందని తెలిపింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ రికార్డుల నుంచి స్క్వేర్ యార్డ్స్ సేకరించిన డేటా ప్రకారం.. అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ఈ క్వార్టర్లో తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఇది రూ.510 కోట్ల విలువైన 621 యూనిట్లను అమ్మింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–-డిసెంబర్ కాలంలో సుమధుర ఇన్‌ఫ్రాకాన్ రూ. 196 కోట్ల విలువైన 145 యూనిట్లను విక్రయించి తరువాత స్థానం లో నిలవగా టాప్ 10 డెవలపర్‌ల జాబితాలో కొత్తగా ప్రవేశించిన మైస్కేప్ ప్రాపర్టీస్ టాప్ డెవలపర్‌ల జాబితాలో కొత్తగా ప్రవేశించింది. అయితే బీఎస్సీపీఎల్ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మకాల విలువపరంగా దాని స్థానాన్ని బలోపేతం చేసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్లో అత్యధిక లావాదేవీలు (8,058 యూనిట్లు) వెస్ట్ జోన్‌లో జరిగాయి. సెంట్రల్ జోన్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌కు డిమాండ్ వ్యాపించింది. ఈస్ట్ జోన్‌లో కూడా రూ. 965 కోట్ల విలువైన లావాదేవీలు (2,536 యూనిట్లు) జరిగాయి. నార్త్ జోన్ 2,179 లావాదేవీలను నమోదు చేసింది. భారతదేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో మార్కెట్ బాగుందని, ప్రాపర్టీలు సరసనమైన ధరల్లో ఉన్నాయని స్క్వేర్ యార్డ్స్ తెలిపింది.