​కేఆర్ఎంబీకి శ్రీశైలం, సాగర్ అప్పగించేందుకు ఒప్పుకున్నరు : నిరంజన్​రెడ్డి

​కేఆర్ఎంబీకి శ్రీశైలం, సాగర్  అప్పగించేందుకు ఒప్పుకున్నరు : నిరంజన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన మినిట్స్​లో ఆ విషయం స్పష్టంగా ఉందని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్​రావు, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

 ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఒప్పుకుని, అలాంటిదేమీ లేదని మంత్రులు బుకాయిస్తున్నారని అన్నారు. వాళ్లు చెప్పే మాటలు నమ్మాలా.. మినిట్స్​లో రికార్డు చేసిన అంశాలను నమ్మాలా అని ప్రశ్నించారు. 2015లోనే ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే నీటి వాటాలు తేల్చేవరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేసీఆర్​ తేల్చిచెప్పారన్నారు. అలాంటిది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే విషయంలో కాంగ్రెస్​ మంత్రులు కేసీఆర్​ను విమర్శించడమే ఓ వింత అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులు కేంద్ర బలగాల పహారాలోకి వెళ్తాయని, కనీసం నీటి వాటాలు తేల్చేదాకా అయినా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సవరించుకోవాలన్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​లో కాంగ్రెస్​ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి వారికి  బహుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రజలపై కరెంట్​భారం పడే ప్రమాదముందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి అధికారిక పర్యటనల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.