యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదు

యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదు

వనపర్తి, వెలుగు: యాసంగిలో రైతులు వరి వేస్తే సెల్ఫ్ మార్కెటింగ్​ ​చేసుకోవాల్సిందేనని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన డిస్ట్రిక్ ఇరిగేషన్​అడ్వైజరీ బోర్డు (డీఐఏబీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలకు మాత్రమే ప్రాజెక్టుల నీళ్లిస్తామని చెప్పారు. దీంతో శ్రీరంగాపురం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.రాజేంద్రప్రసాద్ ఆయనను అడ్డుకున్నారు. ‘‘ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కింది 60 % భూములు బురద పొలాలే.. వీటిలో వరి తప్ప ఇతర పంటలు పండవని మీకు కూడా తెలుసు.. మరి వేరే పంట ఎట్ల వేయాలె’’ అని నిలదీశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదని, వరి వేసే రైతులు సెల్ఫ్ మార్కెటింగ్​చేసుకోవాలని, అవసరమైతే మిల్లర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా అలంపూర్ ఏరియాకు సాగునీరు ఇస్తామని, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ 1, 2 స్కీంలు పూర్తయితే చివరి ఆయకట్టుదాకా  ఇవ్వొచ్చన్నారు. డీఐఏబీ మీటింగ్​ల సమాచారం జిల్లా అధికారులు తనకే ఇవ్వడం లేదని నాగర్​కర్నూల్​ ఎంపీ రాములు అన్నారు. ఇక రైతులకు ఏం సేవలు అందిస్తారని ప్రశ్నించారు. ఈ మీటింగ్​కు రైతులనూ పిలవాల్సి ఉండగా, ఎవరినీ అనుమతించలేదు.  జూరాల, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ తో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ల నుంచి యాసంగికి నీటివిడుదలపై చర్చించారు.