న్యూఢిల్లీ: దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోడీ గ్రూప్‌కు చెందిన రూ.253 కోట్ల విలువైన వజ్రాలను, ఆభరణాలను, బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం తెలిపింది. పంజాబ్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన కేసులో ఈడీ విచారణ చేస్తోంది. హాంకాంగ్‌లోని నీరవ్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొన్ని ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటన్నింటినీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం నీరవ్ మోడీ యూకేలోని జైలులో ఉన్నాడు. ఇప్పటివరకు ఈ కేసులో అటాచ్ చేసిన, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 2,650 కోట్లకు చేరుకుందని అధికార వర్గాలు తెలిపాయి.
