నిర్మల్, వెలుగు: నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలకు జాతీయ స్థాయి స్కోచ్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ శనివారం ఢిల్లీలో ఈ అవార్డులను స్వీకరించారు. జిల్లాలో మాతృత్వ మరణాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కలెక్టర్ రూపొందించిన అమ్మ రక్షిత కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. మాతృత్వ మరణాలు గణనీయంగా తగ్గాయి. అలాగే నిర్మల్ కొయ్య బొమ్మకు అవసరమైన పొనికి కర్ర పెంపకం కోసం కలెక్టర్ ప్రత్యేకంగా వనాలను ఏర్పాటు చేయించారు. దీంతో కలప కొరత తీరనుండగా, నిర్మల్ కొయ్య బొమ్మలకు కలెక్టర్ జీవం పోసినట్లయింది. ఈ రెండు కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపుగా స్కోచ్ అవార్డులు లభించాయి.
‘పోలీస్ అక్క’తో జిల్లా ఎస్పీకి..
విద్యార్థులు, మహిళల భద్రత కోసం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల చేపట్టిన పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు దక్కింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ అవార్డును స్వీకరించారు. మహిళా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ తో పాటు కేజీబీవీలు, పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మానసిక ధైర్యం కల్పిస్తూ భద్రతపై భరోసా కల్పిస్తూ అండగా నిలిచారు. పోలీస్ అక్కలుగా మహిళా పో లీసులు కేజీబీవీల్లో ఒక రోజు బస చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు గృహ హింస, శారీరక మానసిక ఒత్తిళ్లు, భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ‘పోలీస్ అక్క’ కార్యక్రమం ద్వారా 7 వేల మంది విద్యార్థులు ఇప్పటి వరకు ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాకుండా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కడం పట్ల పోలీసువర్గాలు హర్షం
వ్యక్తం చేస్తున్నాయి.
