- సమస్యలు తెలిపేందుకు క్యూఆర్ కోడ్ఏర్పాటు: కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: రంజాన్ మాసంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్మంగళవారం కలెక్టరేట్లో అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రంజాన్ నెలలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట రోడ్లకు రిపేర్లు చేయాలని, పార్కింగ్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు.
రంజాన్ మాసంలో ముస్లింలకు ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని, ఇందుకు ఆయా ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంజాన్ నాడు అన్ని ఈద్గాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, మైనారిటీ అధికారి మోహన్ సింగ్, ఆర్డీవో రత్నకళ్యాణి, ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.
