నిర్మల్, వెలుగు: మొక్కజొన్న పంట కొనుగోళ్లలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మే 31 నాటికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చారని తెలిపారు.
బహిరంగ మార్కెట్ లో క్వింటాల్‌కు రూ.1,700 నుంచి రూ.-1,800 మాత్రమే లభిస్తుండగా, ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా రైతులకు అధిక లాభం చేకూరిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయడం ద్వారా మే 30 నాటికే 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు పూర్తిచేసి రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా రికార్డు సృష్టించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు 1.34 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను గోదాములకు తరలించగా, సుమారు 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రాల్లో మిగిలి ఉన్నాయని తెలిపారు. జూన్ 2 నాటికి ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1.08 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్లు తెలిపారు. ప్రతి గింజను కొంటామని, రైతులు అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
