వడ్ల కొనుగోలు అక్రమాలు..నిర్మల్ ఎమ్మెల్యేకు ముడుపులు

వడ్ల కొనుగోలు అక్రమాలు..నిర్మల్ ఎమ్మెల్యేకు ముడుపులు
  • 20 మంది సీనియర్లను పక్కన పెట్టి సన్నిహితుడికి పోస్టింగ్
  • జొన్నల కొనుగోళ్లపై ప్రభుత్వం విచారణ చేయించాలి
  • మంత్లీ ఎమ్మెల్యేగా మారిపోయిన మహేశ్వర్ రెడ్డి 
  • మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కామెంట్స్ 

నిర్మల్, వెలుగు:  వడ్ల కొనుగోలులో రాష్ట్ర సర్కార్ రైతులకు అండగా ఉంటే.. అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రైతుల వద్ద దోచుకుంటున్న డబ్బులన్నీ ఎమ్మెల్యేకు ముడుపులుగా వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలు అయినా నియోజవర్గంలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 

శుక్రవారం ఆయన నిర్మల్ లోని తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ధాన్యాన్ని తరలించే ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్ట్  పొందిన వ్యక్తికి ఒక్క లారీ కూడా లేదని, అతనికే టెండర్ అప్పచెప్పారని పేర్కొన్నారు. గతంలో తరుగు పేరిట 41 కేజీలకుగాను ప్రస్తుతం 45 కిలోల ధాన్యాన్ని తూకం వేస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే ఉద్ధేశపూర్వకంగా అడ్డుకుంటున్నారన్నారు. ముథోల్, నిర్మల్ ఎమ్మెల్యేలు కుమ్మక్కై తమ సన్నిహితుడిని ఇరిగేషన్ డీఈగా నియమించుకున్నారని,  ఇందుకు 20 మంది సీనియర్లను పక్కన పెట్టి అతనికి అక్రమంగా పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు. 

నిర్మల్ మండలం సిద్ధాపూర్ వాగుపైన చెక్ డామ్ ను ధ్వంసం చేశారని, స్వర్ణ వాగులో నీటిని విడుదల జాప్యంపైనా హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. రూ. 800 కోట్లు నిధులను కేంద్రం నుంచి తెచ్చాననే ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపాలని డిమాండ్ చేశారు. తాను మంత్రిగా మంజూరు చేయించిన పనులకే ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. జిల్లాలో జొన్నల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఎమ్మెల్యే అండదండలతో పెద్దఎత్తున అక్రమ ఇసుక దందా సాగుతుందని ఆరోపించారు. నెలకొసారి నియోజకవర్గానికి వస్తూ మంత్లీ ఎమ్మెల్యేగా మారిపోయారని ఎద్దేవా చేశారు. 

 మీడియా సమావేశంలో ఎఫ్ఎస్ సీ ఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, బనసపల్లి పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల మహేష్, సారంగాపూర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, లక్ష్మణ్ చందా మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్ పాల్గొన్నారు.