జన సంచారం లేని ప్రాంతాల్లో ఒంటరి జంటలే వారి టార్గెట్​ 

జన సంచారం లేని ప్రాంతాల్లో ఒంటరి జంటలే వారి టార్గెట్​ 
  • ఏకాంతంగా ఉంటే దోచేస్తారు 
  • ఇన్ స్టాగ్రామ్ లోనూ కత్తులు, తుపాకులతో పోస్టులు  
  • నిర్మల్​లో ఓ ముఠా అరాచకం
  • సోషల్ ​మీడియా సెల్​ నిఘా
  • చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

నిర్మల్, వెలుగు: ఇన్ స్టాగ్రామ్​లో కత్తులు, నకిలీ తుపాకులు పట్టుకున్న ఫొటోలు పెట్టడమే కాకుండా...ఒంటరిగా వెళ్తున్న మహిళలు, సంచారం లేని చోట ఏకాంతంగా ఉండే జంటలను బెదిరిస్తూ దోచుకుంటున్న ముఠాను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. పట్టణంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతానికి చెందిన అవేజ్ చావుష్‌‌, చిక్కడపల్లి వీధికి చెందిన షేక్ మతీనుద్దీన్, షేక్ ఆదిల్ జల్సాలకు  అలవాటు పడ్డారు. వీరు ముగ్గురూ ఇన్ స్టాగ్రామ్​లో మతిన్ మాఫియా పేరిట ఓ అకౌంట్​ ఓపెన్ చేశారు. అందులో కత్తులు, నకిలీ తుపాకులు పట్టుకున్న ఫొటోలు పెట్టి మతిన్​మాఫియాలో జాయిన్​ కావాలని పోస్టులు పెడుతుండేవారు.

జన సంచారం లేని ప్రదేశంలో ఏకాంతంగా ఉండే జంటలను, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను, మహిళలను నకిలీ తుపాకీతో బెదిరిస్తూ దోచుకునేవారు. బస్టాండ్​లో పడుకున్న వారిని కూడా వదలకుండా దోచేవారు. ఇన్​స్టాగ్రామ్​ గురించి నిర్మల్ పోలీస్ విభాగానికి చెందిన సోషల్ మీడియా సెల్ కు సమాచారం రావడంతో సీరియస్ గా దృష్టి పెట్టింది. శుక్రవారం పోలీసులు స్థానిక మంచిర్యాల చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు కనిపించారు. పోలీసులను చూసి పారిపోబోయారు.

దీంతో వెంబడించి స్థానిక శ్యామ్ ఘడ్ వద్ద అవేష్ ,  మతినుద్దీన్​లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు షేక్ ఆదిల్ ను కూడా పట్టుకున్నారు. మతీనొద్దీన్ మొబైల్స్​దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడని, షేక్ ఆదిల్ హైదరాబాద్​లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తుపాకీ కొన్నాడని చెప్పారు. వీరి నుంచి స్కూటీతో పాటు మూడు సెల్ ఫోన్లు, నకిలీ తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ గంగా రెడ్డి, టౌన్​ సీఐ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్  పాల్గొ న్నారు.