నిర్మల్ బంగల్పేట్ చెరువులో మాక్డ్రిల్ .. రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సిద్ధం: ఎస్పీ

నిర్మల్ బంగల్పేట్ చెరువులో మాక్డ్రిల్ .. రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సిద్ధం: ఎస్పీ

నిర్మల్/బాసర/ భైంసా, వెలుగు: వరద ప్రమాదాలను ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ బృందాలను సిద్ధం చేసినట్లు నిర్మల్​ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పరిధిలో బాసర గోదావరి నది, నిర్మల్​పట్టణంలోని బంగల్​పేట్ చెరువులో, భైంసా పట్టణ శివారులోని గడ్డెన్న సుద్దివాగు ప్రాజెక్టు వద్ద పోలీస్ సిబ్బందికి గురువారం శిక్షణ ఇచ్చారు. నదిలో భక్తులు స్నానం చేస్తూ మునిగిపోతుంటే కాపాడే విధానంపై మాక్​డ్రిల్​ నిర్వహించారు. నీటిలో మునిగిపోతున్నవారిని రక్షించే విధానం, రెస్క్యూ ప్రక్రియను డీడీఆర్ఎఫ్ ఇన్​చార్జ్ ఆర్ఐ రమేశ్​ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదురైనా ఎదుర్కొనేందుకు డీడీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లను ఈ ట్రైనింగ్ కోసం ఎంపిక చేశామన్నారు. శిక్షణ పొందిన సభ్యులు విపత్తుపై సమాచారం అందగానే ప్రమాద స్థలానికి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. ఇప్పటికే సామగ్రి పంపిణీ చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్పీ రాజేశ్ మీనా, భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, ఇన్​స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, కృష్ణ, మల్లేశ్, బాసర ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.