జల దిగ్బంధంలో నిర్మల్.. నీట మునిగిన పట్టణం

జల దిగ్బంధంలో నిర్మల్.. నీట మునిగిన పట్టణం
  • ఆదిలాబాద్-నిర్మల్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
  • ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో రెండుగంటలపాటు గొడవకు దిగిన ముంపు బాధితులు
  • నిర్మల్ చుట్టూ 11 చెరువులు.. 
  • ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు
  • కబ్జాలకు పాల్పడింది అధికార పార్టీ నేతలేనని స్థానికుల మండిపాటు
  • నిర్మల్ జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశం

నిర్మల్‍ జిల్లా: బారీ వర్షాలకు నిర్మల్‍ జిల్లా అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన నిర్మల్ పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అతి భారీ వర్షాలతో జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. జిల్లా కేంద్రం పరిస్థితి చూస్తుంటే రోడ్లన్నీ మాయమైపోయాయి. జిల్లా కేంద్రం అంతా చెరువును తలపిస్తోంది. మూడు రోజులుగా ముసురు పట్టి అదేపనిగా వర్షాలు కురుస్తున్నాయి. 
వరుణుడికి కోపం వచ్చిందేమో.. మొగులుకు చిల్లుపడ్డదేమో అన్నట్లు ఈ రోజు ఉదయం నుంచి వర్షం దండిచికొడుతోంది. కడెం ప్రాజెక్టు 13 గేట్లు ఓపెన్‍ చేయాల్సి రావడంతో పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. 
భారీ వర్షాల ప్రభావంతో ఆదిలాబాద్-నిర్మల్ మధ్య రాకపోకాలు నిలిచిపోయాయి. నిర్మల్-ఖానాపూర్ మార్గంలో బాబాపూర్ వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోయింది. నిర్మల్ పట్టణం చుట్టూ 11 చెరువులు ఉండగా... వీటిలో ఐదు గొలుసు కట్టు చెరువులు.. అన్నీ పూర్తిగా నిండిపోయాయి. అన్ని చెరువులను కబ్జా చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టారు. కబ్జాలకు పాల్పడింది అధికార పార్టీ నేతలేనని స్థానికుల మండిపడుతున్నారు. ముంపు ప్రాంతాలను పదేళ్ల నుంచి నేతలు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్న ఎమ్మెల్ విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పదేళ్లుగా తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యేను ముంపు బాధితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం పై తమకు నమ్మకం లేదని.. ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలనివ్వబోమని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో రెండు గంటలపాటు ముంపు బాధితుల గొడవకు దిగారు. 
నిర్మల్ జిల్లాకు ఎన్టీఆర్ఎఫ్ దళాలు
నిర్మల్ జిల్లా అంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్న ఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. నిర్మల్ జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ ఎఫ్ దళాలను పంపాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులంతా వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.