ప్రధాని ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధత కల్పిస్తం: నిర్మలా సీతారామన్

 ప్రధాని ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధత కల్పిస్తం: నిర్మలా సీతారామన్
  • అదనంగా అప్పు కావాలంటేనే  మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినం
  • మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసిన్రు  
  • బంగారం లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని బీజేపీ మీడియా సెంటర్ లో నిర్మల మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఆపలేదని ఆమె స్పష్టం చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే దారి మళ్లించింది. పైగా మోదీ సర్కారే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపుతున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్నరు. బీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోదీని కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం సిగ్గుచేటు. ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా కించపర్చే ఈ ప్రభుత్వం .. తెలంగాణకు అవసరమా?” అని ప్రశ్నించారు. ‘‘మోటార్లకు కచ్చితంగా మీటర్లు పెట్టాలని మేం ఎప్పుడూ చెప్పలేదు. ఎఫ్ఆర్ బీఎం పరిమితికి మించి అదనంగా అప్పు కావాలంటే మాత్రం కేంద్రం తెచ్చిన సంస్కరణలు అమలు చేయాల్సిందేనని చెప్పాం. ఇందులో భాగంగానే మోటార్లకు మీటర్లు పెట్టి, మిగతా రాష్ట్రాలు అప్పులు తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా అదనంగా అప్పు తీసుకోవాలంటే మీటర్లు పెట్టుకోవచ్చు. అది వారి ఇష్టం” అని స్పష్టం చేశారు. 

ఎస్సీలను కేసీఆర్ మోసం చేసిండు.. 

రాష్ట్ర సర్కార్ చేసిన అప్పులు రాబోయే తరాలకు భారంగా మారుతాయని నిర్మల ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మిగులు బడ్జెట్‌‌తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు అప్పులపాలైంది. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదు. దళితబంధు పథకం ఎంతో గొప్పదని చెప్పి, అమలు చేయకుండా మోసం చేశారు. అధికారంలోకి రాగానే దళిత వ్యక్తిని సీఎం చేస్తామని చెప్పి చేయలేదు. ఎస్సీ అయిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి, ఆ పదవి నుంచి ఆరు నెలల్లోనే తొలగించారు. ఇది దళితులపై కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి” అని ఫైర్ అయ్యారు.

బీసీల అభివృద్ధి కోసం రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కార్.. కేవలం రూ.77 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు. మిగతా నిధులు దేనికోసం వాడారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో 11 యూనివర్సిటీల పరిధిలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్షరాస్యతలో దేశ సగటు కంటే తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా 72 శాతం అక్షరాస్యత ఉంటే, తెలంగాణలో మాత్రం 66 శాతమే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. కేసీఆర్ హయాంలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ ధ్యాసంతా కుటుంబంపైనే.. 

కేసీఆర్ ఆలోచనంతా ప్రజల కోసం కాకుండా తన కుటుంబం కోసమేనని నిర్మల విమర్శించారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కానీ అవి నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రాష్ట్రానికే ఎంతో గొప్పదని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతున్నాయి. అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసి తీరుతాం” అని చెప్పారు.

ALSO READ :  సూర్యాపేట బాగుపడాలంటే కాంగ్రెస్‌ను గంగలో పారేయాలి : కేసీఆర్​

ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం కూడా బీఆర్ఎస్ సర్కార్ కు చేతకాలేదు. ప్రశ్నపత్రాలు లీక్ కావడం సిగ్గుచేటు.17 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ చేసి, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునేలా చేశారు. దీనికి కేసీఆర్ సర్కార్ దే బాధ్యత” అని మండిపడ్డారు. కేసీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవడం లేదని, బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని విమర్శించారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తామని, అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్ధులను ఉచితంగా తీసుకెళ్తామని చెప్పారు.