
- రెండో విడతలో 3.16 లక్షల కోట్లు కేటాయించిన నిర్మలా సీతారామన్
- త్వరలో ‘ఒకే దేశం–ఒకటే కూలి..’ ‘ఒకే దేశం–ఒకే రేషన్’
- ఉపాధి హామీ పథకంలో కూలి రేటు రూ.202కు పెంపు
- మైగ్రెంట్లకు మరో రెండు నెలలు ఫ్రీగా బియ్యం, శనగపప్పు
- పాడి రైతులు, మత్స్య కారులకు కూడా కిసాన్ కార్డులు
రైతులకు సాయం చేస్తమని.. పేదలకు ఉపాధి కల్పిస్తమని.. మైగ్రెంట్లకు బువ్వ పెడుతమని.. వ్యాపారులకు అప్పు ఇస్తామని చెప్పారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్. వరుసగా రెండో రోజు కూడా ప్యాకేజీ పంపకం కొనసాగించారు. ఇప్పటిదాకా ఇచ్చినవి.. ఇకపై ఇచ్చేవాటి గురించి వివరించారు. 3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్లు ఇప్పటికే ఇచ్చినమని, తాజాగా మరో 2.5 కోట్ల మందికి రూ.2 లక్షల కోట్లతో లోన్లు ఇస్తామన్నరు. ఇకపై కూలి రేట్లలో తేడా ఉండదని, దేశమంతా ఒకే కూలి రేటు ఉండేలా చూస్తామన్నారు. వలస కూలీలకు సాయం చేసేందుకు రేషన్ కార్డుల ఇంటర్ స్టేట్ పోర్టబులిటీని తీసుకొస్తామన్నారు. షెల్టర్లలో ఉండే మైగ్రెంట్లకు మూడు పూటల తిండి పెడుతున్నామని చెప్పారు. వలస కూలీలకు మరో రెండు నెలలు ఫ్రీ రేషన్ ఇస్తామని చెప్పారు. రెండో విడతలో రూ.3.16 లక్షల కోట్లు కేటాయించిన నిర్మల.. ఇప్పటిదాకా రూ.9 లక్షల కోట్ల పంపిణీ పూర్తిచేశారు.
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రెండో విడత వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. రూ.3.16 లక్షల కోట్లను పలు రంగాలకు కేటాయించారు. మైగ్రెంట్ వర్కర్లకు ఉచితంగా ఆహార ధాన్యాలు, రైతులకు రాయితీ రుణాలు, వీధి వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ అందజేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2 లక్షల కోట్ల రాయితీ రుణాలు ఇస్తామని వెల్లడించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీలో భాగంగా చేస్తున్న కేటాయింపులను వివరించారు. నిర్మలతోపాటు కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కూడా పలు విషయాలు వెల్లడించారు.
3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్లు
దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రాయితీపై ఇప్పటికే రూ.4.2 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు నిర్మల చెప్పారు. ఈ రుణాల చెల్లింపులపై 3 నెలల మారటోరియం ఇచ్చామని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నట్లు చెప్పారు. మార్చి, ఏప్రిల్‌లో రూ.86 వేల కోట్ల విలువైన 63 లక్షల లోన్లు అప్రూవ్ చేశామని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనేందుకు 6,700 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం మరిన్ని పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.
కొత్తగా 25 లక్షల కిసాన్ కార్డులు
‘‘కొత్తగా 25 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశాం. వీరికి రూ.25 వేల కోట్ల రుణాలు మంజూరు చేశాం” అని కేంద్ర మంత్రి నిర్మల చెప్పారు. పాడి రైతులు, మత్స్య కారులు కూడా కిసాన్ కార్డులు అందజేస్తామని వివరించారు. మార్చిలో రూరల్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌కు 4,200 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ క్యాపిటల్ ఫండ్ కింద నాబార్డ్‌కు రూ.30 వేలకోట్ల అదనంగా ఇస్తున్నట్లు నిర్మల చెప్పారు. యాసంగి కోతలు, మార్కెటింగ్.. వానాకాలానికి సంబంధించిన ముందస్తు పనుల కోసం ఈ ఫండ్స్ వాడాలన్నారు. దీని వల్ల సుమారు 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు లాభం కలుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల ద్వారా అందజేస్తారని తెలిపారు.
ఆగస్టు నాటికి వన్ నేషన్.. వన్ రేషన్
‘‘రేషన్ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. వచ్చే రెండు నెలలు కూడా వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం(కొన్ని చోట్ల గోధుమలు) ఇస్తాం. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు కూడా అందజేస్తాం” అని నిర్మల చెప్పారు. ‘‘రేషన్ కార్డు లేని వారు బియ్యం, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా.. కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. ఉచిత పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే” అని వివరించారు. ఇప్పటికే దేశంలో రేషన్ కార్డుల పోర్టబులిటీ 83 శాతం పూర్తయిందని. మార్చి 2021 నాటికల్లా 100 శాతం పోర్టబిలిటీని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు నాటికి ఒకే దేశం–ఒకే కార్డు విధానం అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు.
ముద్ర శిశు లోన్లపై 2 శాతం వడ్డీ రాయితీ
రూ.50 వేలలోపు ముద్ర శిశు లోన్లు తీసుకున్నవారికి వడ్డీ రాయితీ ఇస్తామని నిర్మల తెలిపారు. మారటోరియం తర్వాత ముద్ర రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుందని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఖర్చు వస్తుందన్నారు.
3 కోట్ల మాస్కులు.. 1.2 కోట్ల లీటర్ల శానిటైజర్
దేశంలోని 12 వేల స్వయం సహాయక సంఘాలు 3 కోట్ల మాస్కులు రెడీ చేసినట్లు నిర్మల చెప్పారు. 1.2 కోట్ల లీటర్ల శానిటైజర్లు తయారు చేసినట్లు తెలిపారు. పట్టణాల్లోని పేదల కోసం 7,200 బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
9 లక్షల కోట్లు పూర్తి..
మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్లలో5.94 లక్షల కోట్లను బుధవారం కేటాయించగా.. 3.16 లక్షల కోట్లను తాజాగా ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా అలొకేట్ చేసిన మొత్తం 9 లక్షల కోట్లకు చేరింది.
సబ్సిడీ ఇండ్లకు 70 వేల కోట్లు
వార్షిక ఆదాయం రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇండ్లు కట్టుకునేందుకు సంబంధించిన సబ్సిడీ స్కీం గడువును ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల చెప్పారు. రూ.70,000 కోట్ల ప్రోత్సాహాన్ని ప్రకటించారు. మార్చి 2021 వరకు ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కొనసాగుతుందని.. ఈ పథకం పొడిగింపుతో 2.5 లక్షల కుటుంబాలకు మందికి లబ్ధి కలుగుతుందని తెలిపారు.
వలస కూలీలకు తక్కువ కిరాయికే ఇండ్లు
వలస కూలీలు, పట్టణ పేదల కోసం అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్(ఏఆర్‌హెచ్‌సీ)లను సిటీల్లో ప్రారంభిస్తామని నిర్మల చెప్పారు. ‘‘పీపీపీ పద్ధతితో ఈ ఇండ్లు కడుతారు. ఈ పథకాన్ని రాష్ర్టాలు చేపడితే కేంద్రం సాయం అందిస్తుంది. భూమి ఉన్న వాళ్లు ముందుకొస్తే సాయం చేసేందుకు కేంద్రం రెడీ’’ అని వివరించారు.
వీధి వ్యాపారులకు రూ.10 వేలు అప్పు
వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్తామని నిర్మల తెలిపారు. సుమారు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణ సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున వర్కింగ్ కేపిటల్ కింద ఇస్తామని వెల్లడించారు. వచ్చే నెల రోజుల్లోనే ఈ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
జుమ్లా ప్యాకేజీ: కాంగ్రెస్
‘‘ప్రధాని నరేంద్ర మోడీ చేసిన రూ.20 లక్షల కోట్ల ప్రకటనను విని.. ప్రజల్లో అంచనాలు పెరిగాయి. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన విన్నాక అందరి ఆశలు ఆవిరయ్యాయి” అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. నిర్మల ప్రకటనలను చూస్తే.. అది ‘జుమ్లా ప్యాకేజీ’ తప్ప ఇంకోటి కాదని మరోనేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. ప్రజలకు కేంద్రం ప్రకటించినది ఎకనమిక్ ప్యాకేజీ కాదని, ఖాళీ ప్యాకేజీ అని సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎగతాళి చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించిన విషయాల్లో ఎన్నో ప్రోగ్రెసివ్ మెజర్స్ ఉన్నాయి. గురువారం ప్రకటించిన ప్యాకేజీతో రైతులు, వలస కూలీలకు ప్రయోజనం కలుగుతుంది. ఆహార భద్రత పెరగడంతోపాటు రైతులు, వీధి వ్యాపారులకు రుణ సదుపాయం మెరుగవుతుంది.
– ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్