ఎల్లారెడ్డిపేట, వెలుగు: వడ్లు దించుకుంటలేరని లారీ లోడ్‌తో ఎల్లారెడ్డిపేట తహసీల్ ఆఫీస్ ఎదుట రైతులు సోమవారం నిరసనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు నోముల ఆదిరెడ్డి, గెంటే దేవయ్య, మేడిశెట్టి మల్లయ్య తమ వడ్లను ఐదు రోజుల కింద గొల్లపల్లిలోని రైస్ మిల్లుకు తరలించారు. 15 క్వింటాళ్ల వడ్లను కట్చేస్తేనే దించుకుంటామని మిల్లర్ చెప్పాడు. దీంతో ఐదు రోజులుగా లారీలోనే వడ్లు ఉన్నాయి.
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సోమవారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సిరిసిల్ల– కామారెడ్డి హైవేపై నిరసన తెలిపారు. డీఎస్‌వో చంద్ర ప్రకాశ్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. వడ్ల లోడ్‌ను మరో మిల్లుకు తరలిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. రైతులో ధర్నాలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, లీడర్లు రాంచంద్రారెడ్డి, నంది నరేశ్ పాల్గొన్నారు.
