సిరాజ్‌ను కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి

సిరాజ్‌ను కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ ఓటమిని తట్టుకోలేక గ్రౌండ్ లోనే చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఈ పరాజయాన్ని భారత అభిమానులతో పాటు టీమిండియా ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం భారత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ఆటగాళ్లకు ధైర్యం చెప్పారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కలుసుకుని, క్రికెట్ ప్రపంచ కప్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనకు అభినందనలు తెలిపారు.

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా స్టార్‌ క్రికెటర్లు తమ ఇంటికి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సోమవారం(నవంబర్ 20) హైదరాబాద్‌ చేరుకోగా రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో సిరాజ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిశారు. ఈ సందర్భంగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టును సీతారామన్‌ అభినందించారు. అదే విధంగా  ఆటలో గెలుపు ఓటములు సహజమని సిరాజ్‌ను ఓదార్చారు.

భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో సిరాజ్ 11 మ్యాచ్‌లలో 33.50 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి వరల్డ్ కప్ లో తన  అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసాడు. సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో కలిసి తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. అయితే ఫైనల్లో మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు.