
బెంగళూరు: ‘వీడియో టేపు’లతో పాపులర్ అయి.. రేప్ సహా ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న స్పిరిచ్యువల్ గురు నిత్యానంద స్వామి. ఈ మధ్య దేశం విడిచి పారిపోయిన ఈయన పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. ఈక్వెడార్ దగ్గర ఓ ఐలాండ్ కొన్నాడని, దానికి కైలాస అని పేరు పెట్టుకున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇంత జరిగితే కర్నాటక పోలీసులు మాత్రం.. కోర్టుకు వెరైటీ సమాధానం చెప్పారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారని, అందుకే కోర్టులో ప్రవేశపెట్టలేకపోయామని విన్నవించారు. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఇలా వింత వాదనలు వినిపించారు.
2010 నాటి కేసు విచారణ సందర్భంగా..
రేప్, చైల్డ్ అబ్యూజ్ తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద.. 2018 నవంబర్ నుంచి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2010 నాటి రేప్ కేసులో నిత్యానంద బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా నిత్యానందను తమ ముందు ప్రవేశపెట్టాలని కర్నాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన డీఎస్పీ బి.బాలరాజ్.. బిడాడి ఆశ్రమంలో నిత్యానంద లేరని, స్పిరిచ్యువల్ టూర్లో ఉన్నారని చెప్పారు. ఆయన సహాయకురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద తీర్థయాత్రల్లో ఉన్న కారణంగా ఆయనను కోర్టు ముందుకు తీసుకురాలేకపోయామని విన్నవించారు. నిత్యానంద ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని పోలీసులకు చెప్పానని, కానీ బలవంతంగా నోటీసు ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారని కోర్టు ఎదుట కుమారి అర్చానంద వాపోయింది. ఎన్నో కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసినా.. ఆయన తీర్థయాత్రలో ఉన్నారంటూ పోలీసులు చెప్పడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై హైకోర్టు కూడా సీరియస్ అయింది.