ఆరోగ్యంలో రాష్ట్రం అంతంతే: నీతి ఆయోగ్​ సర్వే

ఆరోగ్యంలో రాష్ట్రం అంతంతే: నీతి ఆయోగ్​ సర్వే
  • పదో స్థానంలో తెలంగాణ..రెండో  ప్లేస్ లో ఏపీ
  • మళ్లీ కేరళకే ఫస్ట్​ ర్యాంక్
  • నీతి ఆయోగ్​ ‘రాష్ట్రాల్లో ఆరోగ్యం, దేశ పురోగతి’ సర్వే

హైదరాబాద్​, వెలుగు: ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ చాలా వెనకబడిపోయింది. పోయినసారికన్నా ఒక్క స్థానం ముందుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పులేదు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ప్రపంచ బ్యాంక్​ సహకారంతో నీతి ఆయోగ్​ ‘రాష్ర్టాల్లో ఆరోగ్యం, దేశ పురోగతి’ పేరిట సర్వే చేసింది. 2017–18లో చేసిన సర్వేను తాజాగా విడుదల చేసింది. 59 మార్కులు తెచ్చుకున్న రాష్ట్రం పదో స్థానంతో సరిపెట్టుకుంది. పోయిన సారి 55.39 మార్కులతో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఈ సారి ఒక్కస్థానాన్ని మెరుగుపరచుకుంది. ఆంధ్రప్రదేశ్​ 65.13 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. 2015–16 నీతి ఆయోగ్​ తొలి సర్వేలో 60.16 మార్కులతో 8వ స్థానంలో నిలిచిన ఏపీ, ఇప్పుడు మరింత మెరుగైన స్థానానికి చేరింది. దేశంలోనే ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మరోసారి కేరళ నిలిచింది. 74.01 మార్కులతో వరుసగా రెండోసారి ఫస్ట్​ ర్యాంకును కొట్టేసింది.

23 అంశాలపై పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నీతి ఆయోగ్​ ఈ సర్వే చేసింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో 28.61 మార్కులతో చివరి స్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాల్లో 74.97 మార్కులతో మిజోరం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆరోగ్య రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో హర్యానా తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఏపీ 4, తెలంగాణ 6వ స్థానంలో నిలిచాయి. శిశు సంరక్షణ, శిశు మరణాల రేటు తగ్గింపు, సెక్స్​ రేషియో, కుటుంబ నియంత్రణ, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో ప్రసవాలు, టీబీ కేసుల గుర్తింపు నివారణ, సర్కార్​ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సుల శాతం, వసతులు వంటి అంశాల ఆధారంగా ఈ సర్వే చేశారు.

 2015-16                2017-18

తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు                                                       5.7 లక్షలు             7.14 లక్షలు

లింగ నిష్పత్తి (వెయ్యి మంది మగపిల్లలకు ఆడపిల్లల సంఖ్య)                     918                      901

శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు)                                        23                         21

ఐదేళ్లలోపే చనిపోతున్నవారు (ప్రతి వెయ్యి మందికి)                                34                         32