భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఆదివారం సీతారామచంద్రస్వామి భక్తులకు శ్రీకృష్ణావతారంలో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మంజీరాలు అద్ది తిరుమంజనం చేసి భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. విశేష హారతులు సమర్పించారు. బంగారు పుష్పాలతో అలంకరణ అనంతరం స్వామికి అర్చన నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు.
శ్రీకృష్ణావతారంలో అలంకరించి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత బంగారు ఊయలలో స్వామిని కూర్చోబెట్టారు. ప్రత్యేక హారతులు ఇస్తూ లాలలు, జోలలు ఆలపించారు. చతుర్వేద విన్నపాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగాయి. వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల రామనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. శ్రీకృష్ణావతార రామయ్యకు వెన్న, పాయసం నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.
పల్లకీలో స్వామిని మిథిలాస్టేడియానికి తీసుకెళ్లి భక్తులకు దర్శనం కల్పించారు. తర్వాత తిరువీధి సేవ జరిగింది. చిన్నారులు గోపికలు, కృష్ణుని వేషధారణలో స్వామికి స్వాగతం పలుకుతూ గోవిందరాజస్వామి ఆలయం వరకు తీసుకెళ్లారు. పూజలందుకుని తిరిగి స్వామి ఆలయానికి చేరుకున్నారు. దారిపొడవునా భక్తులు స్వామికి మంగళనీరాజనాలు పలుకుతూ మొక్కులు చెల్లించుకున్నారు. హారతులు ఇచ్చారు.
