భద్రాచలం, వెలుగు : గోదావరి తీరంలో కరకట్ట కింది భాగంలో స్నానఘట్టాల వద్ద రెండో రోజు ఆదివారం రాత్రి ఏరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పర్యవేక్షణలో జరిగిన కల్చరల్ ప్రోగ్రాంలు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నదీ తీరమంతా పండుగ వాతావరణంలో కళకళలాడగా, సంప్రదాయ అలంకరణలు, రంగు రంగు దీపాల వెలుగులు, కళా వేదికల మధ్య నిర్వహించిన ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
గోదావరి ప్రవాహం నడుమ సాంస్కృతిక సుగంధం పరిమళించడంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు భారతీయ సంస్కృతి,సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించాయి. శాస్త్రీయ నృత్యాల సమ్మేళనంతో సాగిన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
