
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు తేవాలని నీతి ఆయోగ్ ప్రపోజ్ చేస్తోంది. ఫిజికల్ బ్రాంచులు లేకుండా ఇంటర్నెట్ ఆధారంగా సేవలను ఈ డిజిటల్ బ్యాంకులు అందిస్తాయని చెబుతోంది. డిజిటల్ బ్యాంకులు– లైసెన్సింగ్, నియంత్రణ పేరిట ఒక డిస్కషన్ పేపర్‌ను నీతి ఆయోగ్ తెచ్చింది. దేశంలో పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు కార్యకలాపాలు చేపట్టడానికి తగిన రోడ్ మ్యాప్‌ను ఇందులో సూచించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లో పొందుపరిచిన బ్యాంకుల తరహాలోనే డిజిటల్ బ్యాంకులూ ఉండాలని పేర్కొంది. సాధారణ బ్యాంకులలాగే డిజిటల్ బ్యాంకులూ డిపాజిట్లు తీసుకుంటాయని, అప్పులు ఇస్తాయని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పరిమితుల మేరకు అన్ని రకాల సర్వీస్‌లనూ ఇస్తాయని తెలిపింది. సాధారణ బ్యాంకులకూ డిజిటల్ బ్యాంకులకూ ఉండే తేడా అల్లా బ్రాంచులు లేకపోవడమేనని పేర్కొంది. ఇప్పటికే పాతుకుపోయిన పాత వాటిని ఎలా ఛాలెంజ్ చేయొచ్చనేది యూపీఐ ద్వారా తేలిపోయిందని, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశంలో మెరుగ్గా ఉందని అభిప్రాయపడింది. దేశంలో ఆధార్ ఆథంటికేషన్లు 55 లక్షల కోట్లను, యూపీఐ ట్రాన్సాక్షన్లు రూ. 4 లక్షల కోట్లను దాటేయడాన్ని నీతి ఆయోగ్ ఈ సందర్భంగా ఉదహరించింది. సొంత బ్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేసుకునే దిశలో దేశం ముందడుగు వేస్తోందని పేర్కొంది. డిజిటల్ బ్యాంకుల ఏర్పాటుకు అవసరమైన టెక్నాలజీ మన వద్ద అందుబాటులో ఉందని, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కోసం బ్లూప్రింట్ తయారుచేయాలని నీతి ఆయోగ్ సూచించింది. తొందర పడకుండా తగిన జాగ్రత్తలతోనే ఈ రెగ్యులేషన్స్‌ను తేవొచ్చని తెలిపింది. సాధారణ బ్యాంకులకు లైసెన్స్‌ను ఆర్బీఐ ఇస్తుందని, డిజిటల్ బ్యాంకులకూ అదే కొనసాగుతుందని, కాకపోతే మరొక డిజిటల్ బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడానికి మరొక స్టెప్ చేరిస్తే సరిపోతుందని పేర్కొంది.
బ్యాంక్ బ్రాంచ్‌లు కొనసాగుతాయ్..కానీ
డిజిటల్ బ్యాంకింగ్ ఊపందుకున్నా ఫిజికల్ బ్రాంచీలు కొనసాగుతాయని బ్యాంకింగ్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఎందుకంటే, ఎక్కువ మంది కస్టమర్లు బ్రాంచ్‌లకు వచ్చి ట్రాన్సాక్షన్లు జరపడానికే ఇష్టపడుతున్నారని పేర్కొంటున్నారు. డిజిటల్ ఛానెల్స్‌ను మరింతగా వాడేలా కస్టమర్లకు అవగాహనను బ్యాంకులు కల్పించాలని సూచిస్తున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సులభమనే విషయం కస్టమర్లకు తెలియాలన్నారు. భవిష్యత్‌లోనూ బ్యాంకుల బ్రాంచులు పూర్తిగా కనుమరగవ్వవని ఎస్‌బీఐ ఎండీ అశ్వని కే తివారి చెప్పారు. బ్రాంచులకు వచ్చి తమ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారన్నారు.