ఖనిజ రంగంపై తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్ గుర్తింపు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖనిజ రంగంపై తెలంగాణ చొరవకు  నీతి ఆయోగ్ గుర్తింపు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఖనిజాల అన్వేషణ కమిటీలో సింగరేణికి చోటు
  • హర్షం వ్యక్తం చేసిన  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: ఖనిజ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యతకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ నెల19న నీతి ఆయోగ్ ప్రకటించిన జాతీయ స్థాయి ఖనిజాల గుర్తింపు & అన్వేషణ కమిటీలో సింగరేణి సీఎండీని సభ్యుడిగా నియమించడం ఈ గుర్తింపునకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన కీలక ఖనిజాల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొని.. బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ సాధించిందన్నారు. 

ఆస్ట్రేలియా, రష్యా, ఘనా దేశాలతో వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. సింగరేణి ఓసీపీ మట్టికుప్పలు, ఫ్లైయాష్‌‌‌‌లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తింపు, వాణిజ్య ఉత్పత్తి కోసం ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌టీడీసీ, సి‌‌‌‌ఐఎంఎంటీ, జేఎన్‌‌‌‌ఏఆర్‌‌‌‌డీడీసీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో సింగరేణి విస్తరణకు ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్‌‌‌‌జీఈఎల్‌‌‌‌తోనూ ఒప్పందం జరిగిందని వివరించారు. 

అలాగే,  రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదాన్  నిగమ్ లిమిటెడ్‌‌‌‌తో కలిసి 2300 మెగావాట్ల థర్మల్ & సోలార్ విద్యుత్ ఉత్పాదనకు సింగరేణి కుదుర్చుకున్న ఒప్పందానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్ల నిర్మాణం కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్‌‌‌‌ను ఆదేశించారు. సింగరేణి ఇప్పుడు కేవలం బొగ్గు సంస్థ మాత్రమే కాదని.. ఖనిజ రంగం, గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే ఆదర్శవంతమైన సంస్థగా ఎదుగుతున్నదని భట్టి పేర్కొన్నారు.

కాలేజీలకు వెంటనే  స్కాలర్‌‌‌‌షిప్ బకాయిలివ్వండి

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన స్కాలర్‌‌‌‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం ఆయన ప్రజాభవన్‌‌‌‌లో ఆర్థిక శాఖతో పాటు విద్యాశాఖ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,813 కళాశాలలకు చెందిన రూ.161 కోట్ల స్కాలర్‌‌‌‌షిప్ బకాయిలు ఉన్నట్లు సమావేశంలో  అధికారులు నిర్ధారించారు. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.