పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు : మంత్రి సీతక్క

పాత పద్ధతిలోనే  పంచాయతీ ఎన్నికలు : మంత్రి సీతక్క
  • డిసెంబర్​లో ఎలక్షన్లు ఉంటయ్: మంత్రి సీతక్క

కామారెడ్డి, వెలుగు: పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క అన్నారు. వచ్చే డిసెంబర్​లో ఎలక్షన్లు ఉంటాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో గురువారం ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘పంచాయతీ ఎన్నికలు మార్చిలోగా నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్ల ఫండ్స్ ల్యాప్స్​ అవుతాయి. పాత పద్ధతిలో బీసీలకు 27శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం. పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తాం. డ్రామా కంపెనీలు పెట్టుకోకు రామారావు.. ఒరిజినల్​గా సమస్యలపై వస్తే సమాధానం చెప్తం. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నరు. కానీ.. మేము మాత్రం సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నం. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరు. జూబ్లీహిల్స్​లో 100 మీడియా సంస్థలు పెట్టుకున్నా.. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. 

బీఆర్ఎస్ హయాంలో సూరత్ నుంచి చీరలు తెచ్చిన్రు. మేము సిరిసిల్ల చేనేత కార్మికులు నేసిన చీరలు పంచుతున్నం. చిల్లర రాజకీయాలు మానుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి’’అని సీతక్క హితవు పలికారు. ప్రజలకు వాస్తవాలు చెప్పటం ఎప్పుడో మరిచిపోయారని, కనీసం తన చెల్లె కవితకైనా జవాబు చెప్పుకోవాలన్నారు. కాగా, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో మంత్రి సీతక్క కాన్వాయ్​ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాలలో మాలవత్ పూర్ణ తండ్రి ఇటీవల మరణించగా ఆమెను పరామర్శించేందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ వెళ్తున్నారు. అంతలోనే కొందరు బీఆర్ఎస్ నాయకులు సన్న వడ్లకు బోనస్​ ఇవ్వట్లేదంటూ మంత్రి వెహికల్​కు అడ్డుపడ్డారు. వెహికల్ కింద పడితే ఎట్లా అని, సమస్యలు ఉంటే వినతిపత్రం ఇవ్వాలని మంత్రి సూచించారు.