నవాబుపేట, వెలుగు : కూతురు వేరే కులం యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో గురువారం వెలుగుచూసింది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హనుమసాన్‌పల్లికి చెందిన ఎల్లయ్య (40)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూతురు ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఆమె బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా.. నవాబుపేట మండల కేంద్రంలో కనిపించింది. యువతిని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడగా.. తాను ఓ యువకుడిని ప్రేమించానని, అతడినే పెండ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య బుధవారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
