రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత
  •     55.5 శాతం మంది మహిళలూ సతమతం
  •     ‘న్యూట్రిషన్​ ప్రొఫైల్’​లో నీతి ఆయోగ్ వెల్లడి​ 
  •     16 లక్షల మంది పిల్లల్లో, 53 లక్షల మంది మహిళల్లో ఎనీమియా
  •     తక్కువ బరువున్న మహిళలు 17.7 లక్షలు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పిల్లలు, మహిళల్లో రక్తహీనత సమస్య పెరిగిందని నీతి ఆయోగ్​ వెల్లడించింది. గత నాలుగేళ్లలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో 9 శాతం, గర్భిణుల్లో 5 శాతం ఈ సమస్య ఎక్కువైందని తెలిపింది. పిల్లల్లో నాలుగేళ్ల కింద 61 శాతం మంది రక్తహీనతతో బాధపడగా ఇప్పుడు 70 శాతం మందికి పైగా ఇబ్బంది పడుతున్నారని.. మహిళల్లో 52.5 శాతం నుంచి 55.5 శాతానికి ఈ సమస్య పెరిగిందని చెప్పింది. పిల్లలు, మహిళల్లో పోషకాహారలోపం సమస్యలు కూడా రాష్ట్రంలో ఎక్కువయ్యాయంది. రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువుందని వివరించింది. మహిళల ఎడ్యుకేషన్​లో రాష్ట్రంలో హైదరాబాద్​ చివరి స్థానంలో ఉందని చెప్పింది. 15 నుంచి 49 ఏండ్ల మధ్య మహిళల్లో, 5 ఏండ్ల లోపు పిల్లల్లో స్థూలకాయం నియంత్రణ, 15 నుంచి 54 ఏండ్ల మధ్య పురుషుల్లో రక్తపోటు నియంత్రణలోనూ హైదరాబాద్‌‌‌‌ లాస్ట్​లో ఉందంది.19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ‘న్యూట్రిషన్ ప్రొఫైల్’ను నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసింది. దేశంలో పోషకాహార లోపం కారణంగా చిన్నారులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంటర్నేషనల్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ పాలసీ రీసెర్చ్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌, ఇండియన్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పాపులేషన్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌, యూనిసెఫ్, ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎకనమిక్‌‌‌‌ గ్రోత్‌‌‌‌  కలిసి రిపోర్టును రెడీ చేశాయి. 

పురుషుల్లో 8% పెరిగిన ఉబకాయం 

పిల్లల్లో 2015–-16లో పెరుగుదల లోపం 28 శాతం ఉండగా 2019–-20కి 33 శాతానికి పెరిగిందని, తక్కువ బరువు (అండర్‌‌‌‌ వెయిట్‌‌‌‌) 28 నుంచి 32 శాతానికి పెరిగిందని నీతి ఆయోగ్​వివరించింది. మహిళల్లో తక్కువ బరువు సమస్య కాస్త తగ్గిందని, గతంలో 23 శాతం ఉండగా 19 శాతానికి పడిపోయిందని తెలిపింది. 2016-–2020 మధ్య ఐదేండ్ల లోపు చిన్నారుల్లో 5 శాతం.. హైట్ కు తగ్గ వెయిట్​, వెయిట్ కు తగ్గ హైట్ లేరని గుర్తించినట్లు పేర్కొంది. పిల్లల్లో తక్కువ బరువు సమస్య ఈ నాలుగేళ్లలో 4 శాతం తగ్గిందని చెప్పింది. మహిళలల్లోనూ ఈ సమస్య 4 శాతం తగ్గిందని, అయితే రక్తహీనత 1 శాతం పెరిగిందని తెలిపింది. మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య 1 శాతం పెరగ్గా.. పురుషుల్లో 8 శాతం ఎక్కువైందని స్పష్టం చేసింది. 

53 లక్షల మంది మహిళల్లో ఎనీమియా

రాష్ట్రంలోని 16,34,760 మంది ఐదేండ్లలోపు చిన్నారులు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారని.. 15 నుంచి 49 సంవత్సరాల వయసులోని మహిళల్లో 53,53,541 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నీతి ఆయోగ్​ తెలిపింది. 97,473 మంది గర్భవతుల్లోనూ రక్తహీనత లోపం గుర్తించామంది. ఐదేండ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం రాష్ట్రంలో ప్రధానంగా సమస్యగా ఉందని పేర్కొంది. 2019–20 లెక్కల  ప్రకారం రాష్ట్రంలో దాదాపు 8.82 లక్షల మంది చిన్నారుల్లో ఈ సమస్యను గుర్తించినట్లు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో 1.73 లక్షల మంది చిన్నారులు (అత్యధికంగా) ఈ సమస్యతో బాధపడుతున్నారంది. ఎత్తుకు తగ్గ బరువు లేని లోపంతో 5,18,647 మంది చిన్నారులు ఇబ్బందిపడుతున్నారని, నల్గొండలో అత్యధికంగా 77,602 మంది ఉన్నారని వివరించింది. 2,06,206 మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేక అనారోగ్యానికి గురవుతున్నారంది. ఈ కేటగిరీలోనూ నల్గొండ టాప్ లో ఉందని చెప్పింది. ఊబకాయంతో రాష్ట్రంలో  8,06,558 మంది ఐదేళ్లలోపు చిన్నారులు బాధపడుతున్నారని, ఇందులో మొదటి స్థానంలో రంగారెడ్డి (1,35,070) ఉందని వివరించింది. 15 -నుంచి 49 ఏండ్ల మధ్య వారిలో 17.76 లక్షల మంది మహిళలు తక్కువ బరువుతో ఉన్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ (2,76,716)లో ఈ సమస్య ఎక్కువుందని తెలిపింది.