పదవి ఎప్పుడు ఊడుతుందోనని ముఖ్యమంత్రికి బెంగ

పదవి ఎప్పుడు ఊడుతుందోనని ముఖ్యమంత్రికి బెంగ

రాజకీయాల్లో అసంతృప్తులు సాధారణం అయ్యాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎమ్మెల్యేలకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉంటే, మంత్రి పదవి వచ్చినోళ్లకు మంచి శాఖ రాలేదని అసంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు. ఇక మంచి శాఖ వచ్చిన మంత్రికి తాను ముఖ్యమంత్రిని కాలేదే అన్న బెంగ ఉంటుందని,  సీఎం పదవి వచ్చినోళ్లకు ఆ పోస్టులో ఎన్నాళ్లు ఉంటామో, ఎప్పుడు పదవి ఊడుతుందోనని బాధపడుతూ ఉంటారని గడ్కరీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ‘‘పార్లమెంటరీ సిస్టమ్ అండ్‌ పీపుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మొత్తంగా రాజకీయాల్లో ఏ నేత కూడా సంతోషంగా లేరన్నారంటూ సభలో ఆయన జోకులు పేల్చారు. దీంతో వేదికపై ఉన్నవాళ్లతో పాటు సభలోని అందరూ ఆయన మాట్లాడుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉండగానే ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీని సీఎం పదవి నుంచి దించేసి, ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో గడ్కరీ కామెంట్స్ సంచలనంగా నిలిచాయి.

అయితే ఆ తర్వాత రాజకీయాలు ఎలా ఉండాలో చెబుతూ.. ప్రజల జీవితాల్లో మార్పులు తేవడమే లక్ష్యంగా నాయకులు పని చేయాలని గడ్కరీ చెప్పారు. కానీ, ప్రస్తుత రోజుల్లో సామాన్య ప్రజల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రజా సేవ అనేది లాస్ట్ ప్రయారిటీ అయిపోయిందని అన్నారు. దురదృష్టవశాత్తు నేతల్లో ఎక్కువ మంది అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.