భార్యను సీఎం చేయడం తప్ప..మహిళల కోసం ఏం చేయలే

భార్యను సీఎం చేయడం తప్ప..మహిళల కోసం ఏం చేయలే
  • ఆర్జేడీ చీఫ్ పై బీహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శలు

ఖగరియా(బీహార్): జైలుకెళ్లినప్పుడు తన భార్యను సీఎం కుర్చి మీద కూర్చోబెట్టడం తప్ప మహిళల సంక్షేమం కోసం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిందేమీ లేదని జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలను, బీసీలను నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజలు వారి మాయలో పడవద్దని కోరారు. శుక్రవా రం పర్ బత్తాలో ఎన్నికల ప్రచారంలో నితీశ్ మాట్లాడారు. ‘ ఆర్జేడీ నేతలు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల పాలనలో మహిళల పరిస్థితి ఎలా ఉండేది? వాళ్లను కనీసం పట్టించుకోలేదు, వాళ్ల సమస్యలపై దృష్టి పెట్టలేదు. మేము అధికారంలోకి రాగానే పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. బీహార్ ఇవాళ అభివృద్ధి సాధించిందంటే అది మహిళల భాగస్వామ్యంతోనే. మహిళల ఎకనమిక్ ఎంపవర్ మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ సాయంతో బీహార్ రూరల్ లైవ్లీహుడ్స్ ప్రాజెక్ట్ (లోకల్ గా జీవిక అని పిలుస్తారు) ను చేపట్టాం’ అని అన్నారు. పోలింగ్ రోజున మహిళలు ముందు ఓటేసి తర్వాతే వంటపనులు స్టార్ట్ చేసుకోవాలని, ఫ్యామిలీలో ఇతరులు కూడా ఓటేసేలా ప్రోత్సహించాలన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల అభివృద్ధి కోసం పని చేశామని చెప్పారు. మొదట్లో సిటీల్లోనూ కరెంటు ఉండేది కాదని, ఇప్పుడు లాంతర్ల యుగానికి ముగింపు పలికినట్లు తెలిపారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులను మంజూరు చేశారని, మరోసారి అవకాశం కల్పిస్తే బీహార్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.