
హైదరాబాద్: మోకాలి గాయంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలోనే వైదొలిగిన టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తాను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశాడు. సన్ రైజర్స్‌ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. 2026 వేలానికి ముందు టీమ్‌లో తన పాత్రపై అసంతృప్తితో సన్‌రైజర్స్‌ను విడిచిపెట్టాలని నితీశ్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై తెలుగు కుర్రాడు ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చాడు. ‘సాధారణంగా నేను ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉంటాను. కానీ కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వడం అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నా బంధం నమ్మకం, గౌరవం, ఎన్నో ఏండ్ల అభిరుచిపై ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఎల్లప్పుడూ ఈ జట్టుతోనే ఉంటాను’ అని నితీశ్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
న్యాయ వివాదంలో నితీశ్
నితీశ్ రెడ్డి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. ప్లేయర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ నితీశ్ తమకు చెల్లించాల్సిన రూ.5 కోట్ల కోసం కోర్టుకెక్కింది. స్క్వేర్ ద వన్ అనే ఏజెన్సీ 2021 నుంచి నాలుగేండ్ల పాటు తెలుగు క్రికెటర్‌ను మెనేజ్ చేసింది. కానీ, బోర్డర్–గావస్కర్ ట్రోఫీ సందర్భంగా నితీశ్ కొత్త మేనేజర్‌ను ఎంచుకున్నాడు. అయితే, నితీశ్ రెడ్డి మేనేజ్‌మెంట్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడంతో పాటు తమకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించడం లేదని ఆర్బిట్రేషన్ నిబంధనల ప్రకారం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
గత నాలుగేండ్ల లో తెలుగు క్రికెటర్ కోసం పలు వాణిజ్య ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెబుతున్న సదరు ఏజెన్సీ తమకు రావాల్సిన మొత్తాన్ని నితీశ్ ఇవ్వడం లేదని వాదిస్తోంది. అయితే, తానే స్వయంగా ఆ డీల్స్ పొందానని అంటున్న నితీశ్ డబ్బుచెల్లించడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి వివాదాలను ఇరు పక్షాలు ప్రైవేటుగా పరిష్కరించుకుంటారు. కానీ, ఈ వ్యవహారం కోర్టుకు చేరడం చర్చనీయాంశంగా మారింది.