గ్రౌండ్ వాటర్ గరళం.. గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నైట్రేట్ కోరలు

గ్రౌండ్ వాటర్ గరళం.. గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నైట్రేట్ కోరలు
  •     గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో నైట్రేట్​ కోరలు 
  •     జోగులాంబ గద్వాలలో 2 వేలు దాటిన టీడీఎస్‌‌
  •     రాష్ట్ర ప్రభుత్వానికి భూగర్భ జలవనరుల శాఖ నివేదిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ తాజా నివేదికలు ఆందోళనకర వాస్తవాలను వెల్లడించాయి. ప్రధానంగా హైదరాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, జోగులాంబ గద్వాల, నల్గొండ వంటి జిల్లాల్లో జల కాలుష్యం కోరలు చాస్తోంది. నైట్రేట్లు, ఫ్లోరైడ్‌‌‌‌, అధిక టీడీఎస్‌‌‌‌  మోతాదులు అనుమతించదగిన స్థాయిని దాటిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ మేరకు భూగర్భ జల వనరుల శాఖ ప్రభుత్వానికి  తాజాగా నివేదించింది. పారిశ్రామికీకరణ, మితిమీరిన ఎరువుల వాడకంతో  భూమి లోపలి పొరలు కలుషితమై జనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాగే నీటిలో ఉండాల్సిన కనీస నాణ్యత కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో భూగర్భ జలాల పైనే ఆధారపడే గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

45 ఎంజీ/ఎల్ దాటిన నైట్రేట్​ స్థాయిలు

పారిశ్రామికీకరణ ప్రభావంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు నైట్రేట్ స్థాయిలు పెరిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలానగర్, కుత్బుల్లాపూర్, ఐడీఏ బొల్లారం వంటి పారిశ్రామిక వాడలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ నైట్రేట్ స్థాయిలు 45 ఎంజీ/ఎల్ కంటే అధికంగా నమోదయ్యాయి. కేవలం పట్టణాలే కాకుండా నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల వంటి గ్రామీణ జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ నిల్వలు కనిపించాయి.  నైట్రేట్ మోతాదు పెరిగిన నీటిని వాడితే పసిపిల్లల్లో రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి ‘బ్లూ బేబీ సిండ్రోమ్’ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా భూమిలోకి వదలడం, మురుగునీటి నిర్వహణ లోపం వల్ల భూగర్భ జలాలు మురుగుమయంగా మారుతున్నాయి. గర్భిణులకు కూడా ఈ నీరు ప్రాణాంతకమని, కడుపులోని పిండం ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది.

ఫోరైడ్​ విస్తరిస్తుందా ?

ఫ్లోరైడ్ రక్కసి వరంగల్, నల్గొండ జిల్లాలను ఇంకా వదలడం లేదని నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ స్థాయి 1.5 ఎంజీ/ఎల్​ అనుమతించదగిన పరిమితిని మించిపోయింది. ఇది  భౌగోళిక పొరల్లోని మార్పుల (జియోజెనిక్​) వల్ల జరుగుతోందని అధికారులు గుర్తించారు. అధిక ఫ్లోరైడ్ నీరు తాగితే ‘డెంటల్ ఫ్లోరోసిస్’ వల్ల పళ్లు పచ్చబడటమే కాకుండా, ఎముకల ఫ్లోరోసిస్‌‌‌‌తో కీళ్ల నొప్పులు, కాళ్లు వంకరపోవడం వంటి శాశ్వత అంగవైకల్యం సంభవిస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటోంది. నల్గొండలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోగా, ఇప్పుడు కొత్తగా వరంగల్ జిల్లాల్లోనూ ప్రమాద స్థాయిని దాటడం ఆందోళనకరంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇక్కడి కమాండ్ ఏరియాలోని అనేక ప్రాంతాల్లో నీటిలోని మొత్తం కరిగిన ఘనపదార్థాల (టీడీఎస్​) మోతాదు ఏకంగా 2 వేల ఎంజీ/ఎల్​ గరిష్ట పరిమితిని దాటేసింది. సాధారణంగా నీటిలో ఖనిజాలు తక్కువగా ఉండాలి.. కానీ, ఇక్కడ అది విషంగా మారింది. ఇలాంటి నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రావడం, కిడ్నీల పనితీరు పూర్తిగా మందగించే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి సమస్యలతో పాటు శరీరంలో జీవక్రియలు దెబ్బతింటాయి. జిల్లాలో భూగర్భ జలాల్లో పెరిగిన ఈ ఖనిజ లవణాల తీవ్రత వ్యవసాయానికి కూడా పనికిరాని విధంగా మారుతోంది. కేవలం గద్వాలలోనే కాకుండా పొరుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలకు కూడా ఈ ముప్పు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెస్టులు సరే.. ప్రత్యామ్నాయ చర్యలపై ఫోకస్​ ఏది?

రాష్ట్రవ్యాప్తంగా నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం గత ఐదేండ్లలో భారీగానే నిధులను మంజూరు చేసింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద 2020-–21లో రూ. 6.47 లక్షల నుంచి ప్రారంభమై 2024–25 నాటికి రూ. 1.31 కోట్ల వరకు ఖర్చు పెంచారు. మొత్తం రూ. 3.65 కోట్లు ఖర్చు చేసి మూడు ప్రధాన కేంద్రాల్లో అధునాతన ల్యాబ్‌‌‌‌లను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ల్యాబ్‌‌‌‌లలో ఐసీపీ-ఓఈఎస్   వంటి 22 రకాల అత్యాధునిక పరికరాల ద్వారా సూక్ష్మ కాలుష్యాలను గుర్తిస్తున్నారు. శాస్త్రీయంగా ఫలితాలను రాబట్టేందుకు అసిస్టెంట్ కెమిస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ల నియామకాలు పూర్తి చేశారు. అయినా, ల్యాబ్ రిపోర్టులు చెబుతున్న చేదు నిజాలు ప్రజారోగ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేవలం గణాంకాల సేకరణతో సరిపెట్టకుండా, కలుషిత జిల్లాల్లో ప్రత్యామ్నాయ సురక్షిత నీటి సరఫరాను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆ నీటినే తాగేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.