ఏపీ బెదిరింపులకు భయపడేది లేదు..ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేస్కోండి: ప్రొ. నాగేశ్వర్

ఏపీ బెదిరింపులకు భయపడేది లేదు..ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేస్కోండి: ప్రొ. నాగేశ్వర్
  • ఏపీ నేతల తీరుపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం 

పంజాగుట్ట, వెలుగు:   ఏపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘తెలంగాణ గొంతుల పై ఆంధ్రా ఇనుప బూట్లు ఇంకెంత కాలం?’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాగేశ్వర్  మాట్లాడారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అరెస్టులంటున్నారని, కానీ తాను భయపడనని, అందుకే యాంటిసిపేటరీ బెయిల్​కు కూడా దరఖాస్తు చేసుకోలేదన్నారు.

తాను కుల చిచ్చుపెడుతున్నానంటూ, అల్లర్లు సృష్టిస్తున్నానంటూ ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తాను ఎక్కడా కుల ప్రస్తావన తేలేదని, రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరిగిన దాఖలాలు లేవన్నారు. తనపై పెట్టిన కేసులను చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆంధ్రాకు సంబంధించిన వారు ఇండ్లు, ఆస్తులు మాత్రం సంపాదించుకున్నారని, కానీ తెలంగాణ వారు మాత్రం ప్రశ్నించకూడదన్నది వారి భావన అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను మాట్లాడుతానని తేల్చి చెప్పారు.

‘‘ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నానికి రావాల్సిన రైల్వే జోన్ ఒడిశాకు తరలిపోయింది. ఏపీలో చమురు నిక్షేపాలను ఓఎన్ జీసీ గుర్తిస్తే దానిని ప్రైవేట్ సంస్థ వేదాంతకు అప్పగించారు. అలాంటి వాటిని ప్రశ్నించి ప్రజలకు వాస్తవాలను తెలిజేస్తున్నందుకే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు” అని ఆరోపించారు. దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవాలని, ఎక్కడికి రమన్నా వస్తానని సవాల్ విసిరారు.

గద్దర్ విగ్రహాన్నీ పెట్టనివ్వడంలేదు: పాశం యాదగిరి 

సినిమాల్లో నటించే వారికి ప్రొఫెసర్ నాగేశ్వర్ విలువ ఏం తెలుస్తుందని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. బూతు పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెడుతున్నారని, కానీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న గద్దర్ విగ్రహాన్ని పెట్టనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో సెటిలర్ల ఓట్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహ హామీని ఇచ్చారని, అందుకే ఇంచు జాగా లేని మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీకి చెందినవారు పెట్టుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగామార్చి దేశానికి రెండో రాజధాని చేయించి మరోసారి పెత్తనం సాగించాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అరుణోదయ గౌరవ అధక్షురాలు విమలక్క మాట్లాడుతూ.. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రశ్నించే, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలన్నారు. గత 40 ఏండ్లుగా రాజకీయ విశ్లేషకులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన చేయలేదన్నారు. నాగేశ్వర్ ఆడిగిన ప్రశ్నలకు సమాధానం లేక దాడులకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు కంబాలపల్లి కృష్ణ, భరద్వాజ, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్  పాల్గొన్నారు.