- ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎంపిక పెండింగ్
- కుదరని ఏకాభిప్రాయం
- ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు
సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ పదవుల ఎంపిక పెండింగ్‌లో పడింది. దీంతో కో ఆప్షన్ పదవి ఆశిస్తున్న వారు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటుండగా, కౌన్సిలర్లు మాత్రం తమను సంతృప్తి పరిచిన వారికే మద్దతుఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాల్టీలుండగా ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కో ఆప్షన్ పదవులకు దరఖాస్తులు స్వీకరించినా ఐదు మున్సిపాలిటీల్లో ఏకాభిప్రాయాలు కుదరక పెండింగ్ లో పెట్టారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాల్టీలో నాలుగు, హుస్నాబాద్ మున్సిపాల్టీలో ఒక్క స్థానం, మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ మున్సిపాల్టీలో నాలుగు , నర్సాపూర్ మున్సిపాల్టీల్లో నాలుగు, సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ మున్సిపాల్టీల్లో నాలుగు స్థానాల్లో కో ఆప్షన్ ఎంపిక వాయిదా పడింది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల ఎన్నికలు జరిగాయి. చేర్యాల, దుబ్బాకల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక సజావుగా జరిగినా గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో ఎంపిక పీటముడి పడింది. గజ్వేల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో నాలుగు కో ఆప్షన్ స్థానాలకు ఆ పార్టీ మద్దతుదారులు 45 మంది దరఖాస్తు చేసుకున్నారు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేయడమే బెటరని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. కాగా గతంలోనూ కో ఆప్షన్ పదవులకు తీవ్ర పోటీ కారణంగా దాదాపు రెండేండ్లు వాయిదా వేశారు.
ఈసారి అదే పునరావృతం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. హుస్నాబాద్ మున్సిపాల్టీలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక సజావుగా జరిగినా నాలుగో అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. హుస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోగా నాలుగు కో ఆప్షన్ స్థానాలకు 11 దరఖాస్తు వచ్చాయి. వీటిలో ఒక దరఖాస్తును అధికారులు తిరస్కరించగా 10 మంది పోటీలో మిగిలారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనతో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మిగిలిన స్థానాన్ని ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంత్రి తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా మెదక్, రామాయంపేట మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికలు ముగిశాయి. తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 9 చోట్ల బీఆర్ఎస్, నాలుగు చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల బీజేపీ కౌన్సిలర్లు గెలుపొందారు. ఈనెల 14న మున్సిపల్ అధికారులు కోఆప్షన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 23వ తేదీ వరకు 31 మంది నామినేషన్ వేశారు. గత ఐదేళ్లపాటు కోఆప్షన్స్ సభ్యుల ఎన్నిక లేకుండానే పాలకవర్గం ముగిసింది.
దీంతో ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న సందేహం కలుగుతోంది. మరోవైపు నర్సాపూర్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ పదవులు ఉన్నాయి. కాంగ్రెస్,- బీజేపీ మధ్య మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు రెండు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక కావాల్సి ఉంది. ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఎంపిక జరగడం లేదు.
సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పెండింగ్
సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీ మినహా అన్ని బల్దియాల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. జహీరాబాద్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో అధికారులు, పాలకవర్గం సభ్యుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. నెల కింద కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనూస్ కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేయగా, ఎంఐఎం, ఇండిపెండెంట్ సభ్యులు హాజరు కాలేదు.
రెండోసారి 22న కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుందని కమిషనర్ కౌన్సిలర్లకు నోటీసులు ఇవ్వగా, కమిషనర్ ప్రకటనకు భిన్నంగా చైర్మన్ 23న కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉందని సర్య్కులర్ జారీ చేయడం చర్చకు దారి తీసింది. చైర్మన్, కమిషనర్ ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎంపిక జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎంఐఎం లోను ఎక్కువమంది పదవులు ఆశిస్తూ ఉండడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో కోఆప్షన్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
