
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ సినిమా ఇది. ఒకరోజు స్కూల్ మిస్ చేసయినా సరే తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లాల్సిన సినిమా. స్కూల్ కంటే ఈ సినిమా చూసి చాలా నేర్చుకుంటారు. నివేద పాత్ర అమ్మని గుర్తుకు తెస్తుంది.
విశ్వ మెచ్యూరిటీతో పెర్ఫామ్ చేశాడు. ప్రియదర్శి ఎంచుకునే కంటెంట్ బావుంటుంది. తనని చూస్తే తెలుగు ఆమీర్ ఖాన్ అనిపిస్తుంది. నంద కిషోర్‌లోని నిజాయితీ సినిమాలో కనిపించింది. ప్రతి అమ్మ, నాన్న ఇది మనమే కదా అనుకునే సినిమా ఇది’ అని చెప్పాడు. ‘ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది’ అని రానా చెప్పాడు. నివేదా మాట్లాడుతూ ‘ఇందులో పోషించిన సరస్వతి లాంటి పాత్ర మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. ఈ పాత్రకు నన్ను నమ్మినందుకు థ్యాంక్స్.
చాలా మంచి, అరుదైన సినిమా ఇది. ప్రపంచంలోని అమ్మలందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం’ అని చెప్పింది. గొప్ప అనుభూతిని ఇచ్చే ఇలాంటి చిత్రంలో నటించడం గర్వంగా ఉందని ప్రియదర్శి చెప్పాడు. నటులు భాగ్యరాజ్, విశ్వదేవ్, కృష్ణ తేజ, దర్శకుడు నందకిషోర్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి, సృజన్ యరబోలు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.