అంకాపూర్​ నాకు ప్రాణంతో సమానం : సీఎం కేసీఆర్

అంకాపూర్​ నాకు ప్రాణంతో సమానం : సీఎం కేసీఆర్
  • గ్రామ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది నేనే
  • కాపుబిడ్డ జీవన్​రెడ్డిని ఆశీర్వదించాలె 
  • ఆర్మూర్​ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్

నిజామాబాద్, ఆర్మూర్, వెలుగు: అభ్యుదయ చైతన్యం నిండిన అంకాపూర్​ రైతులంటే తనకు ప్రాణంతో సమానమని, ప్రపంచవ్యాప్తంగా ఆ గ్రామ గొప్పదనాన్ని ప్రచారం చేసింది తానేనని బీఆర్ఎస్​అధినేత, సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్మూర్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో  సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘15 ఏండ్ల కింద, ఎలాంటి పదవి లేనప్పుడు జీవన్​రెడ్డి ఎర్రజొన్న రైతుల కోసం ఆమరణ దీక్ష చేసిండు. అప్పటి కాంగ్రెస్​గవర్నమెంట్​ రైతుల మీద పోలీస్​ కాల్పులు చేయించింది. విషయం తెలిసి కరీంనగర్​లో ఉన్న నేను ఆర్మూర్​ వచ్చిన. ఆ సమయంలో  జీవన్​రెడ్డి నాకు సన్నిహితుడైండు. ఎప్పుడు నా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్​అతను. కాపుబిడ్డ,  నిష్కర్షగా మాట్లాడతాడు’’ అని  కేసీఆర్​ పేర్కొన్నారు. ‘‘ఆర్మూర్​ ​గవర్నమెంట్​హాస్పిటల్ ​ప్రసూతి సేవల్లో రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందింది. ఆర్మూర్​లోని సిద్ధుల గుట్ట ఎంతో డెవలప్ ​అయింది. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే జీవన్​రెడ్డిని మరోసారి గెలిపించి పంపండి” అని సీఎం పేర్కొన్నారు.

మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే డ్యాన్స్​

ఆర్మూర్​లోని ఆలూరు రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో సీఎం కేసీఆర్ సభా మైదానానికి ఉదయం 11 గంటలకే జనం వచ్చారు. మధ్యాహ్నం 3.40 గంటలకు సీఎం రాగా, అప్పటిదాకా వేచి ఉన్న జనం కేసీఆర్​ వచ్చాక వెళ్లడం షురూ చేశారు. సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​లో హెలిక్యాప్టర్ ​దిగిన సీఎంకు మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎంపీ సురేశ్​రెడ్డి, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  కేసీఆర్​ రాకముందు మిట్టపల్లి సురేందర్​కళాబృందం ఆడిపాడారు. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్​గుప్తా, షకీల్ అహ్మద్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, కార్పొరేషన్ చైర్మన్లు మార గంగారెడ్డి, డాక్టర్ మధు శేఖర్, ఎల్ఎంబీ రాజేశ్వర్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

మనసున్న మహారాజు కేసీఆర్

అడిగింది లేదనకుండా ఇచ్చే మనసున్న మహారాజు సీఎం కేసీఆర్. ఆయన ఆశీస్సులు, ప్రజల దయతో మళ్లీ ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుస్తా. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కర్మ, కర్త, క్రియ కేసీఆరే. సీఎం అండతో రూ.3 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశా. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ ఎర్రజొన్న రైతులకు బకాయిలు చెల్లించి ఆదుకున్న దేవుడు కేసీఆర్. సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు, రెవెన్యూ డివిజన్ గా ఆర్మూర్, గోదావరి నది పై పంచగూడ వంతెన, వందపడకల ఆసుపత్రి, రూ. 500 కోట్ల లో  లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, 11 బైపాస్ రోడ్లు తదితర పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. – జీవన్​రెడ్డి, ఆర్మూర్​ ఎమ్మెల్యే