- ఆన్లైన్లో బుకింగ్ యాప్
- ట్రాక్టర్ సమకూర్చుకుంటే ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఇక నుంచి ఇసుక పర్మిషన్లు ఆన్లైన్లోనే పొందాలని, ఆఫ్‌లైన్ విధానానికి స్వస్తి చెప్పినట్లేనని, మన ఇసుక వాహనం స్కీమ్ యాప్ అమలులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మైనింగ్, గ్రౌండ్ వాటర్ ఇంజినీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని, లబ్ధిదారులు ట్రాక్టర్ సమకూర్చుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఇండ్లు కట్టుకునే వారు, సర్కార్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.1,173 యూపీఐ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించి ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని, ఫోన్లులేని వారు పంచాయతీ సెక్రటరీలను కలవాలని తెలిపారు. టిప్పర్లు, లారీలకు అనుమతి లేదని చెప్పారు.
ఇసుక రీచ్‌ల్లో జేసీబీ, డోజర్లు వాడొద్దని, కూలీలతోనే ట్రాక్టర్ ట్రాలీల్లో ఇసుక నింపించాలన్నారు. ఇసుక రవాణాలో అక్రమాలు నివారించడానికి అమలు చేస్తున్న ఈ కొత్త విధానాన్ని సక్సెస్ చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవోలు సీరియస్‌గా పర్యవేక్షించాలని ఇక నుంచి మాన్యువల్ రశీదులు, పర్మిషన్లు ఇవ్వడానికి వీలులేదని వెల్లడించారు.
