ధాన్యం సేకరణలో జాప్యం వద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ధాన్యం సేకరణలో జాప్యం వద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ఆర్మూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దని  నిజామాబాద్​ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం ఆర్మూర్​లోని ధోబీఘాట్ వద్ద, కమ్మర్​పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడారు.  ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం  వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులపై ఉన్నాయా అంటూ రైతులను ఆరా తీశారు.  ఆర్మూర్​ లోని ధోబీ ఘాట్ వద్ద గల కేంద్రంలో ధాన్యం సేకరణలో జాప్యం చేస్తున్నారని రైతులు కలెక్టర్ కు చెప్పగా,  జాప్యం ఎందుకు చేస్తున్నారని నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసే సొసైటీలకు వచ్చే సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించవద్దని  పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.  

మిల్లర్లు సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. సూపర్ అమాన్ రకం ధాన్యం దిగుమతి చేసుకునేందుకు కొందరు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదని కేంద్రాల నిర్వాహకులు తెలుపగా, మిల్లర్లతో మీటింగ్ పెట్టి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.  కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్​ వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్​ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు తదితరులు ఉన్నారు.