ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆర్మూర్, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు దసరా పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో శమీ పూజలు చేశారు.  జమ్మి పంచుకుని అలయ్​ బలయ్​ తీసుకున్నారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆర్మూర్​ జంబి హనుమాన్​ మందిరంలో   దసరా ఉత్సవాల్లో  ఆర్మూర్ ఎమ్మెల్యే   జీవన్ రెడ్డి పాల్గొన్నారు.   సర్వసమాజ్​ ఆధ్వర్యంలో వెంకటేశ్వర రథం మందిరం ఆవరణలోకి రాగానే రావణ సంహార కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో  జబర్దస్థ్​ టీం,   కోకిల నాగరాజు టీం​ ప్రదర్శనలు  ఆకట్టుకున్నాయి.  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత దంపతులను, ప్రజాప్రతినిధులను ఉత్సవ కమిటి   సన్మానించింది.  మున్సిపల్​ చైర్​ పర్సన్ పండిత్​ వినీత పవన్, వైస్​ చైర్మన్​ షేక్ మున్ను, టీఆర్​ఎస్​ నియోజకవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్​ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.  బోధన్​ లోని భీముని గుట్ట  వద్ద దసరా పండుగ  ఘనంగా జరుపుకున్నారు.  పురప్రముఖులు గంగాధర్​ పట్వారీ, దేశాయి తదితరులు   ర్యాలీగా భీముని గుట్ట వద్ద చేరుకుని..   జమ్మిచెట్టు  దగ్గర  యజ్ఞం,  ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో  మున్సిపల్​ చైర్ పర్సన్​ తూము పద్మావతి,  కౌన్సిలర్లు, నాయకులు పాల్గోన్నారు.  ధర్పల్లిలో దసరా ఉత్సవాలకోసం గ్రామకమిటీ నిర్మించిన   జెండా గద్దెను    జడ్పీటీసీ సభ్యుడు జగన్​, ఎంపీపీ సారికహన్మంత్​రెడ్డి, సర్పంచి బాల్​రాజ్  ప్రారంభించారు. అనంతరం శమీ పూజ చేసి..   రావణ దహనం చేశారు.  భిక్కనూరులో  స్ధానిక బాలుర పాఠశాల ఆవరణలో  సర్పంచ్​ తునికి వేణు ఆధ్వర్యంలో   దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పండుగను ఘనంగా చేసుకున్నారు.   ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.   బాన్స్​వాడలో జరిగిన వేడుకల్లో  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్​ భాస్కర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రోడ్ల రిపేర్లకు రూ. 10లక్షలు సాంక్షన్
లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం  మాలపాటి గ్రామంలో పంటపొలాలకు వెళ్లే రోడ్ల రిపేర్లకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ తెలిపారు. గురువారం ఆయన  గ్రామంలో పర్యటించి  ప్రజల  సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  గ్రామశివారులో  పొలాలకు వెళ్లే మట్టి రోడ్డును ట్రాక్టర్​పై వెళ్లి పరిశీలించారు.  రోడ్డు చెడిపోయి ధాన్యాన్ని ఇండ్లకు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని రైతులు చెప్పడంతో ఆయన ఫండ్స్​ ఇస్తున్నట్టు ప్రకటించారు. పనులు వెంటనే ప్రారంభించాలని స్థానిక టీఆర్​ఎస్​ లీడర్లకు సూచించారు.  అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ , తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి  ప్రాధాన్యం ఇస్తోందని, మాలపాటి రైతులు భూములను అమ్ముకోవద్దన్నారు.   లింగంపేట,నాగిరెడ్డిపేట మండలాలకు తొందరలోనే కాళేశ్వరం నీటిని అందిస్తామన్నారు.   పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండిందని, ఆయకట్టులో రెండు పంటలు పండుతాయని చెప్పారు.  ఎమ్మెల్యే వెంట గ్రామసర్పంచ్​ ఆశం, ఎంపీటీసీ బోధనం ఇందిర, టీఆర్​ఎస్​ గ్రామకమిటీ అద్యక్షుడు ముస్కుల కిషోర్​రెడ్డి,శెట్పల్లి సంగారెడ్డి సర్పంచ్​ అనిల్​రెడ్డి, టీఆర్​ఎస్​ మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్  ఉన్నారు.

టీఆర్​ఎస్​ లీడర్ల సంబురాలు
బోధన్, కామారెడ్డి, వెలుగు: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్​పేరును భారత​ రాష్ట్ర సమితిగా  మార్చడంతో ఉమ్మడి జిల్లా అంతటా ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి.. స్వీట్లు పంచుకుని వేడుకలు జరుపుకున్నారు. దేశ్​కీ నేతా కేసీఆర్​ అంటూ నినాదాలు చేశారు.    బోధన్​ మండలం పెగడపల్లి, సాలూరల్లో ఆపార్టీ సంబరాలు చేసుకున్నారు.   రైతు బంధు మాజీ కోఆర్డినేటర్​ బుద్దె రాజేశ్వర్,  ఎంపీపీ బుద్దె సావిత్రి, డీసీసీబీ  డైరెక్టర్లు  శరత్​, ​గిర్దవార్​  గంగారెడ్డి, మార్కెట్​ కమిటి చైర్మెన్​ వెంకటేశ్వర​ దేశాయ్​,  పార్టీ  మండల ప్రెసిడెంట్​ నర్సన్న తదితరులు  పాల్గొన్నారు.      భిక్కనూరు మండల కేంద్రంలోని స్ధానిక తెలంగాణ చౌరస్తాలో పార్టీ లీడర్లు సంబురాలు చేసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి,  పట్టణ సర్పంచ్​ తునికి వేణు,యంపీపీ గాల్​రెడ్డి,జడ్​పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్ తదితరులు  పాల్గొన్నారు. కామారెడ్డి  జిల్లా కేంద్రంతో పటు,  మండలాల్లో పటాకులు కాల్చారు.   దేశ ప్రజలు  కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని లీడర్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో మున్సిపల్​ చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి,  సీనియర్​ లీడర్​ నిట్టు వేణుగోపాల్​రావు,  ఎంపీపీ పిప్పిరి అంజనేయులు, టౌన్​ ప్రెసిడెంట్​ జూకంటి ప్రభాకర్​రెడ్డి,  లీడర్లు చంద్రశేఖర్​రెడ్డి, మామిండ్ల అంజయ్య, నజీర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బైక్​ ప్రమాదాల్లో నలుగురు మృతి
డిచ్​పల్లి, ఇందల్వాయి, వెలుగు: డిచ్​పల్లి, ఇందల్వాయి మండలాల్లో జరిగిన   వేర్వేరు ప్రమాదాల్లో 4గురు చనిపోగా.. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.   ఎన్​హెచ్​ 44 పై సీఎంసీ కాలేజీ దగ్గర రెండు బైక్​లు ఢీకొని ఇద్దరు చనిపోయారు.  డిచ్ పల్లి మండలం సుద్దపల్లికి  చెందిన గుట్టకింద అజయ్​ (22) గురువారం   బైక్​ పై స్వగ్రామానికి వెళ్తుండగా..  యానంపల్లికి చెందిన బంటు సాయిలు అలియాస్​ సామెల్​(50)   నామాల శ్రీకాంత్​ తో కలిసి ఎదురుగా రాంగ్​రూట్​ లో వచ్చి  ఢీకొట్టాడు.  అజయ్​, సాయిలు అక్కడికక్కడే చనిపోగా..   శ్రీకాంత్​ కి తీవ్రగాయాలయ్యాయి.  సుద్దపల్లి. తదితర గ్రామాలకు సర్వీస్​ రోడ్డు లేకపోవడం, చాలా దూరం వరకు యూ టర్న్​ లు లేకపోవడంతో చాలామంది  రాంగ్​ రూట్​లో వస్తున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.  హైవే నిర్మించి 12 ఏండ్లయినా   సర్వీస్​ రోడ్డు నిర్మించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్​ రోడ్డు నిర్మించాలని ఎన్​హెచ్​ఏఐ ఆఫీసర్లకు, కలెక్టర్​, ఎమ్మెల్యేలు, మంత్రులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని  మండిపడ్డారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో చనిపోయారని, ఎంతమందో గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానికులు ధర్నా చేశారు.   కలెక్టర్​, తహసీల్దార్​, ఎస్​ఐ  హమీతో  ధర్నా విరమించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ గణేశ్ చెప్పారు.  
బైక్​లు అదుపుతప్పి ఇద్దరు.. 
ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన తాళ్ల సంతోష్​ (27)  వ్యక్తి దుర్గమాల   ధరించాడు. మాల విరమణ చేసి గ్రామానికి వస్తుండగా బుధవారం సాయంత్రం ఇందల్వాయి అటవీ ప్రాంతంలో బైక్​ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన మదన్​లాల్​(37) ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని క్రషర్​ లో కూలీ గా పని చేస్తున్నాడు. గురువారం మండలకేంద్రానికి సరుకుల కోసం వెళ్లిన అతను తిరిగి వస్తుండగా బైక్​ అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు.   కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ నరేశ్​ చెప్పారు. 
 తాగుడుకు అలవాటు పడి.. ఒకరి సూసైడ్​
ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన ఆవుల మల్లేశ్​​(25) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెంది మల్లేశ్​  బుధవారం తన పొలం వద్ద ఉరి వేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. అతని  భార్య 8 నెలల గర్బవతి.

ప్రశాంతంగా నిమజ్జనం

బోధన్​,నవీపేట్ , వెలుగు: బోధన్ లో  సార్వజనిక్​ ఉత్సవ కమిటీ  ఆధ్వర్యంలో దుర్గామాత శోభయాత్ర ప్రశాంతంగా  సాగింది.  ఉత్సవకమిటీ ప్రెసిడెంట్​ రాజులదేవి  పవన్​కుమార్​ , మున్సిపల్​ చైర్​ పర్సన్​ తూము పద్మావతి,  ఏసీపీ   కిరణ్​కుమార్​, మారుతిమందిర్​ చైర్మెన్​  అశోక్​రెడ్డి, శివాలయం  చైర్మెన్​ భరత్​యాదవ్​లు ప్రత్యేక  పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.    శివాలయం నుంచి  ప్రారంభమైన యాత్ర  ప్రధాన వీధుల మీదుగా సాగి..  గోదావరి నదికి చేరుకోగా.. నదిలో నిమజ్జనం చేశారు. యాత్ర సందర్భంగా పోలీసులు భారీ భద్రతాఏర్పాట్లు చేశారు.  ఈకార్యక్రమంలో టిఆర్​ఎస్​, బీజేపీ,  కాంగ్రెస్​లీడర్లు  భక్తులు పాల్గొన్నారు.  
నవీపేటలోనూ  దుర్గామాత నిమజ్జన కార్యక్రమం గురువారం  కన్నుల పండుగగా నిర్వహించారు. పదకొండు రోజులపాటు అమ్మ వారికి పూజలు చేసిన భవానీ భక్తులు శోభాయాత్ర నిర్వహించి..   బాసర గోదావరి నది లో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలనుంచి తరలించిన  దుర్గామాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేశారు. 

బీఆర్​ఎస్​తో వచ్చేదేం లేదు
నిజామాబాద్ టౌన్ ,వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్  అప్పుల ఊబిలోకి నెట్టేశారని తెలంగాణ  టీడీపీ  నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షులు దేగాం యాదాగౌడ్ ఆరోపించారు. గురువారం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  తెలంగాణలో  శాంతి  భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు.  తెలంగాణ వస్తే దళితులను సీఎం చేస్తానని  ప్రజలను మోసం చేశాడన్నారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ గా మార్చడంవల్ల  ప్రజలకు ఏ మేలు ఉండదన్నారు. బీఆర్​ఎస్​ అంటే  బార్ అండ్ రెస్టారెంట్ సమితి గా ప్రజలు అనుకుంటున్నారన్నారు.  కార్యక్రమంలో టీడీపీ లీడర్లు  వినోద్ కుమార్, మోహన్ దాస్,  అంబిక సత్యనారాయణ, లవంగా రాజు, నర్సయ్య, కార్తిక్ స్వామి, ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ విజేతలకు బహుమతుల పంపిణీ
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లోని విద్యానగర్ అభివృద్ధి కమిటీ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేవి మండపం వద్ద బుధవారం రాత్రి  బతుకమ్మ పోటీలను నిర్వహించారు. విజేతలకు మున్సిపల్​ చైర్​ పర్సన్​ పండిత్​ వినీత పవన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్​ మక్కల సాయినాథ్, కాలనీ కమిటీ   ప్రెసిడెంట్​బత్తుల భాస్కర్, సెక్రటరీ ఆకుల గంగాధర్,  కమిటీ మెంబర్స్​బట్టు గంగాధర్,  ద్యావరశెట్టి శ్రీనివాసబాలు, యు.సాయన్న, చిట్టాపూర్ నర్సయ్య పాల్గొన్నారు.