ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోధన్ మండలం ఎరాజ్‌‌పల్లి తదితర గ్రామాల్లో ఐదొద్దులకే సద్దులు నిర్వహించడం ఆనవాయితీ.. ఈ మేరకు గురువారం ఆయా గ్రామాల్లో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేసి పంచాయతీ కార్యాలయాల వద్ద ఉయ్యాల పాటలతో ఆటలాడారు. నిజామాబాద్ కలెక్టరేట్‌‌, మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో,  వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్‌‌‌‌ నీతూకిరణ్‌‌ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో స్పీకర్​ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి కొద్ది సేపు బతుకమ్మ ఆడారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హైకోర్ట్ అడ్వకేట్ రచనారెడ్డి ఆధ్వర్యంలో బతుకుమ్మ సంబురాలు జరిగాయి. - వెలుగు, నిజామాబాద్‌‌ 

దళిత బంధు మీటింగ్‌‌కు పోయిండని..కుల బహిష్కరణ

నిజామాబాద్ టౌన్, వెలుగు: దళిత బంధు మీటింగ్ వెళ్లినందుకు నిజామాబాద్‌‌ జిల్లా వర్ని మండలంలో ఒకరిని కుల బహిష్కరణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం నిజామాబాద్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌ మీట్‌‌లో బాధితుడు తన బాధను మీడియాకు వివరించాడు. గతంలో కరీంనగర్‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌కు వర్ని మండలం జాకోర గ్రామానికి చెందిన దండు చిన్న సాయిలు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఆశగొళ్ల పోశెట్టి, ఎర్ర చిన్న సాయిలు, పొట్టోళ్ల సాయిలు, పొట్టోళ్ల కిరణ్‌‌లు చిన్న సాయిలును బహిష్కరించారు. అయితే వీరి మాటను కాదని సాయిలుతో మాట్లాడిన 8 కుటుంబాలను కూడా బహిష్కరించాని బాధితుడు పేర్కొన్నాడు.

అంతటితో ఆగకుండా తమతో మాట్లాడిన 30 మంది వ్యక్తులకు రూ.500 జరిమానా విధించడంతో పాటు రెండోసారి మాట్లాడితే రూ.15 వేలు జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని వివరించాడు. తమను కుల బహిష్కరణ చేసి మానసికంగా హింసిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని చిన్న సాయిలు డిమాండ్ చేశారు. సమావేశంలో సామల పెద్ద లక్ష్మయ్య, కసాబ్ గంగారం, ఇస్తారు, గంగారం, పొట్టోళ్ల కృష్ణ ,సాయమ్మ, రామవ్వ పాల్గొన్నారు.

అటవీ సంరక్షణ బిల్లు రద్దు చేయాలి

సిరికొండ, వెలుగు: అటవీ సంరక్షణ నియమావళి 2022 బిల్లును వెంటనే రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రతిభ స్కూల్‌‌లో జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికే  కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిదని ఆరోపించారు. కేసీఆర్ దీనిని వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఏళ్ల నుంచి పోడు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి పాపయ్య, రాష్ట్ర నాయకులు ఎర్రన్న, నర్సయ్య, జిల్లా నాయకులు భూమయ్య, పోషన్న, కారల్‌‌మార్క్, ఐఎఫ్‌‌టీయూ నాయకులు బాలయ్య, దాసు, కాజమొహినుద్దీన్‌‌ పాల్గొన్నారు.

కుల వివక్షపై పోరాడాలి

సిరికొండ, వెలుగు: కుల వివక్షపై ప్రతీ ఒక్కరు పోరాడాలని సీపీఐ ఎంఎల్​ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ప్రభాకర్​ అన్నారు. మండలంలోని గడ్కోల్‌‌లో పార్టీ ఆధ్వర్యంలో కుల రక్కసికి వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల గడుస్తున్న దేశంలో కుల వ్యవస్థ పోలేదన్నారు. కుల వివక్షను పారద్రోలేందుకు యువతకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి సీఐ చంద్రశేఖర్, ఏఐకేఎంఎస్ నాయకులు రామకృష్ణ, రమేశ్‌‌, బాబన్న పాల్గొన్నారు.

పోడు భూములపై సర్వే

భిక్కనూరు, వెలుగు: మండలంలోని సిద్దరామేశ్వరనగర్, గుర్జకుంట గ్రామాల్లో గురువారం పోడు భూములపై సర్వే నిర్వహించినట్లు ఎంపీడీవో అనంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్‌‌ భూములతో పాటు అగ్రికల్చర్​ ల్యాండ్స్‌‌ సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు అందిస్తామని చెప్పారు. ఆయన వెంట ఆఫీసర్లు దీపిక, అనురంజని, సర్పంచులు శ్రీనివాస్, మనోహర రమేశ్‌‌రెడ్డి, రైతులు ఉన్నారు.

ప్రతి రైతు ఇన్సూరెన్స్‌‌ చేసుకోవాలి

భిక్కనూరు, వెలుగు: సొసైటీలో ఉన్న ప్రతి రైతు తప్పని సరిగా ఇన్సూరెన్స్‌‌ చేయించుకోవాలని బస్వాపూర్ విండో చైర్మన్ లింగాల కిష్టాగౌడ్ సూచించారు. గురువారం సింగిల్‌‌ విండో ఆఫీస్‌‌లో ఏర్పాటు చేసిన 57వ మహాజన సభ నిర్వహించారు. బస్వాపూర్, కాచాపూర్ గ్రామలకు కొత్త విండో ఏర్పాటు చేయాలని, రైతులు పండిస్తున్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, విండో పరిధిలోని రుణలు వంద శాతం మాఫీ చేయాలని తీర్మానం చేశారు. సమావేశంలో ఎంపీపీ గాల్‌‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్ది స్వామి, సీఈవో మహేశ్వరి, మార్కెట్‌‌ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, విండో
 డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

నిజామాబాద్‌‌ సీపీ నాగరాజు

నిజామాబాద్, వెలుగు: వృత్తి పరమైన ఒత్తిళ్లకు గురికాకుండా నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిజామాబాద్‌‌ సీపీ కె.ఆర్ నాగరాజు సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గురువారం మెడి కవర్ హాస్పిటల్స్ ఆధ్వరంలో  ‘మినీ వాక్‌‌ థాన్‌‌’ నిర్వహించారు. స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ సర్కిల్ వరకు చేపట్టిన ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో నాణ్యమైన సేవలు అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ సామాజిక బాధ్యతతో ఈ ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. 50 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సిగరెట్, ఆల్కహాల్ వంటి వ్యాసనాలకు దూరంగా ఉండాలన్నారు. జీవన శైలిలో మార్పులతో గుండెను కాపాడుకోవచ్చని తెలిపారు.  
డాక్టర్‌‌‌‌ సందీప్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యం కోసం నిత్యం కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలన్నారు. వ్యాయమంతో డిప్రెషన్‌‌ తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు విద్యాసాగర్, శ్రీనివాస్, రవికిరణ్, వాను, కళ్యాణ్, మేనేజర్ శ్రీనివాస్‌‌శర్మ, స్వామి, లహరితో పాటు 200 మంది యువకులు పాల్గొన్నారు

బహుజన రాజ్యంతోనే సామాజిక న్యాయం
బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ సూర్యప్రకాశ్

నిజామాబాద్, వెలుగు: బహుజనులకు రాజ్యంతోనే సామాజిక న్యాయం జరుగుతుందని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవన్‌‌లో నిర్వహించిన బీఎల్ఎఫ్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ జనాభాలో 85 శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్రకులాలు ఒక్కటై బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజకీయాల్లోకి రాకుండా తొక్కేస్తున్నారని ఆరోపించారు. దళిత, బహుజనులు రాజ్యాధికారం దిశగా ఐక్య పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ సామాజిక జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్‌‌యాదవ్ బహుజన మహానీయులు, బహుజన ఉద్యమాలు అనే అంశాలపై వివరించారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్‌‌, రాష్ట్ర నాయకులు ఉపేందర్‌‌రెడ్డి, వనం సుధాకర్, పర్వతాలు, ఎస్.సిద్దిరాములు, జిల్లా నాయకులు కె.మధు,కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

మాక్లూర్, వెలుగు: ఛత్రపతి శివాజీ చరిత్ర యువతకు స్ఫూర్తి దాయకమని, యువత ధర్మ రక్షణ కోసం పాటు పడాలని ఆర్మూర్ బీజేపీ ఇన్‌‌చార్జి పొద్దుటూరి వినయ్‌‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నాపూర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో నందిపేట్ పలుగుట్ట వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, పటేల్ ప్రసాద్, మండలంలోని వివిధ గ్రామాల లీడర్లు పాల్గొన్నారు.

ఘరానా దొంగ అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాలతో పాటు హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 18 దొంగతనాలతో పాటు హత్యాయత్నాలకు పాల్పడిన ఆదర్శ్ నగర్‌‌‌‌కు చెందిన కందికంటి రాజు(30)ను తన ఇంటి వద్ద అరెస్టు చేశారు. నేరాలకు ఉపయోగించిన కారుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్‌‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. మూడో టౌన్ ఎస్సై నరేశ్‌‌ను ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ శ్రీశైలం అభినందించారు.

ధరణిని రద్దు చేయాలని ఆందోళన

బిచ్కుంద, వెలుగు:పేదలకు సమస్యలు సృష్టిస్తున్న ధరణి పోర్టల్‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ బిచ్కుంద, పిట్లంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార పిలుపు మేరకు గురువారం బిచ్కుందలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పిట్లంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా 
నిర్వహించారు.

రైతుల అభివృద్ధికి కృషి చేస్తాం..

సిరికొండ, వెలుగు: రైతుల అభివృద్ధే ధ్యేయంగా సొసైటీలు పని చేస్తున్నాయని సిరికొండ, తూంపల్లి సొసైటీ చైర్మన్లు మైలారం గంగారెడ్డి, రాములునాయక్ చెప్పారు. గురువారం మండలంలోని ఈ రెండు సొసైటీల మహాజన సభలు వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సీజన్‌‌లో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు. క్రాప్, ఎల్టీ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు ప్రకాశ్, అబ్బాస్, డైరెక్టర్లు లక్ష్మణ్, రమేశ్‌‌, చిన్నారెడ్డి, గంగాధర్, నర్సయ్య, సీఈవోలు గిరి, దేవిలాల్ పాల్గొన్నారు. 

రెండో రోజూ కొనసాగిన దీక్ష

మద్నూర్‌‌‌‌, వెలుగు: కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాలని కోరుతూ మద్నూర్‌‌‌‌లో చేపట్టిన రిలే నిరాహర దీక్ష రెండో రోజూ కొనసాగింది. గురువారం నిర్వహించిన దీక్షను ఆర్యవైశ్య సంఘం సభ్యులు సాగించారు. మద్నూర్‌‌‌‌లో వెంటనే కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాలని డిమాండ్‌‌ చేశారు. ఈ సందర్భంగా  గాంధీ చౌక్ నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు.

డెడ్‌‌బాడీతో తహసీల్దార్‌‌‌‌ ఆఫీసు ముందు ఆందోళన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన మున్వర్​ఖాన్‌‌(65)  గుండెపోటుతో చనిపోగా, వారసత్వ ఆస్థిని ఆయనకు తెలియకుండా మరొకరి పేరిట మార్చారని పేర్కొంటూ బంధువులు శవాన్ని తీసుకుని గురువారం తహసీల్దార్​ ఆఫీసుకు వచ్చారు.  అంబులెన్స్‌‌లో డెడ్‌‌ బాడీని ఉంచి  ఆందోళన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూర్​ఎల్లారెడ్డి శివారులో   మున్వర్​ఖాన్ ఫ్యామిలీకి  4 ఎకరాల 3 గుంటల భూమి ఉంది.

మున్వర్ వాళ్లు ఐదుగురు అన్నదమ్ములు.  ఈయన దుబాయికి వెళ్లడంతో  ఇతడి రెండో తమ్ముడు అజిజ్​ఖాన్, ఆయన భార్య హైమద్​బేగం పేరిట భూమిని గత కొన్నేండ్ల కింద మార్చుకున్నారన్నారు.  దీనిపై మున్వర్​ఖాన్​కోర్టుకు వెళ్లారు. తాజాగా ఈ భూమిని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. తన పేరిట ఉన్న భూమిని మార్పిడి చేయడం, తాజాగా తమ్ముళ్లు మరొకరికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో మనస్తానంతో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు తెలిపారు. గురువారం తహసీల్దార్​ ఆఫీసుకు శవాన్ని తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. తహసీల్దార్‌‌‌‌  వెంకట్‌‌రావు అందుబాటులో లేకపోవడం డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌తో వాగ్వివాదానికి దిగారు.  పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో డెడ్‌‌ బాడీని తీసుకెళ్లారు.

బోధన్ మున్సిపల్ మీటింగ్ రసాభాస

వాయిదా వేసిన మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌
 ప్రశ్నిస్తే వాయిదా వేస్తారా..
పలువురు కౌన్సిలర్ల ఆగ్రహం

బోధన్, వెలుగు: బోధన్‌‌ మున్సిపల్ మీటింగ్ రసాభాసగా మారింది. గురువారం మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌ తూము పద్మావతి అధ్యక్షతన మున్సిపల్ మీటింగ్ ప్రారంభం కాగానే పట్టణంలో అభివృద్ది పనులు చేపట్టడానికి 10 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టారు.  వాటిపై చర్చ కొనసాగించారు. కొందరు కౌన్సిలర్లు ఎజెండా అంశాలకు సపోర్టు చేయగా మరి కొందరు వ్యతిరేకించారు. దీంతో ఎజెండా అంశాలపై కౌన్సిల్ మీటింగ్‌‌లో ఓటింగ్ నిర్వహించారు. ఎజెండా అంశాలకు సరిసమానంగా ఓటింగ్ రావడంతో మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌ కౌన్సిల్ మీటింగ్‌‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభివృద్ధి  పనులపై ప్రశ్నిస్తే మీటింగ్ వాయిదా వేయడం  ఏమిటని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణతో కొందరు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ నిర్వహించేందుకు కోరం ఉన్నా ఎందుకు వాయిదా వేస్తున్నారని నిలదీశారు.

ఎట్టి పరిస్థితిలోనైనా మీటింగ్​ నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు పట్టుబట్టారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనుల లెక్కలు అడిగితే చెప్పడంలేదని, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడంలేదన్నారు. చివరకు కౌన్సిలర్లు పలు సమస్యలను ఆర్డీవో రాజేశ్వర్‌‌‌‌కు దృష్టికి తీసుకవెళ్లడంతో ఆయన మున్సిపల్ మీటింగ్ వద్దకు చేరుకుని సముదాయించారు. దశరా పండుగా అనంతరం మీటింగ్ సమన్వయంతో నిర్వహించుకోవాలని సూచించారు.