వెల్​నెస్ సెంటర్​​కు  వెళ్లాలంటేనే భయం

వెల్​నెస్ సెంటర్​​కు  వెళ్లాలంటేనే భయం
  •     మూడేళ్ల కాలంలో మూడుచోట్లకు మార్పు
  •     ప్రస్తుత బిల్డింగ్​లో ఓల్డ్​ఏజ్ వారికి అంటువ్యాధుల ప్రమాదం
  •     సెంటర్ కు రావాలంటే జంకుతున్న పేషెంట్లు
  •     కలెక్టరేట్ బిల్డింగ్ కూల్చివేతతోనే సమస్య
  •     శాశ్వత బిల్డింగే పరిష్కారమంటున్న పెన్షనర్లు

​నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని వెల్​నెస్ సెంటర్ కు పక్కా బిల్డింగ్​లేకుండాపోయింది. ఈ సెంటర్​ ఏర్పాటైన మూడేళ్ల కాలంలో ఇప్పటికే మూడుసార్లు మార్చారు. దీంతో అక్కడికి వచ్చేవారు తరుచూ ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో పాత కలెక్టర్​ ఆఫీసు వెనుకాల గెస్ట్​హౌస్​లో వెల్​నెస్ ​సెంటర్ ​దాదాపు మూడేళ్లు కొనసాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 200మంది మెడిసిన్స్ తీసుకెళ్లేవారు. వారిలో దీర్ఘకాల హెల్త్​ఇష్యూస్ ఉన్న గవర్నమెంట్​ పెన్షనర్లు 70శాతం వరకు ఉంటారు.

నగర శివారులో బైపాస్ వద్ద కొత్తగా నిర్మించిన  కలెక్టరేట్ ను​ గతేడాది నవంబర్​లో మార్చాక పాత బిల్డింగ్ ​మొత్తం కూల్చేశారు. దీంతో వెల్​నెస్ సెంటర్​ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లోని నాలుగో ఫ్లోర్​కు షిఫ్టు చేశారు. అదీ టీబీ వార్డు పక్క ఉండడంతో. వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగుల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి మందులు తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఓపీ గణనీయంగా పడిపోయింది.

తాజా షిఫ్టింగ్​ మరీ అధ్వానం.. 

కలెక్టర్​కు పలుమార్లు ఫిర్యాదులు అందడంతో ఇదే హాస్పిటల్ ​బిల్డింగ్​ వెనుక గ్రౌండ్​ ఫ్లోర్ లో ఉన్న మెప్మా బిల్డింగ్​ను కేటాయించారు. దీంతో గత మేలో వెల్​నెస్ కేంద్రాన్ని అక్కడికి తరలించారు. ఇది సెంటర్​కు చేరువలో లెప్రసీ వార్డు, తీవ్రమైన జబ్బులతో ఆఖరు దశ ఎదుర్కొంటున్న వారి పాలియేటివ్​కేర్ సెంటర్ పక్కనే ఉంది. దీనికి తోడు హాస్పిటల్​ లీకేజీల డ్రైనేజీ కంపు ఇబ్బంది పెడుతోంది. సెంటర్​కు ఒకసారి వచ్చినవారు పరిసరాలు చూసి భయంతో మరోసారి రావడంలేదు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి కనీసం వాష్​రూమ్​లు కూడా లేవు. వెడల్పు గదిలో పరదాలు కట్టి డ్యూటీలు చేస్తున్నారు. 

వస్తున్నవారంతా మెడిసిన్స్ కోసమే..

జిల్లాలోని గవర్నమెంట్​ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబీకులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం మూడేళ్ల కింద నగరంలో వెల్​నెస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ముగ్గురు డెంటిస్టులు, ఒక ఫిజియోథెరపిస్టు, కొద్ది మంది సిబ్బందితో స్టార్ట్ చేసిన సెంటర్లో ఎలాంటి టెస్టులు చేయండంలేదు. అసలు విషయం ఏమంటే హెల్త్ కార్డు ఉన్నవారు కేవలం మెడిసిన్స్ కోసమే ఇక్కడికి వస్తున్నారు. బైపాస్ సర్జరీ, బీపీ, షుగర్, థైరాయిడ్, డయాలసిస్​తదితర ఇష్యూస్ ఉన్నవారు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని జబ్బులకు సంబంధించిన ఖరీదైన మెడిసిన్స్ వెల్​నెస్​లో లభిస్తాయి.

ఈఎస్ఐ బిల్డిండ్ ​కోసం ప్రపోజల్స్...​

పీఎఫ్​ఆఫీసుకు దగ్గరగా నిరుపయోగంగా ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ ​బిల్డింగ్​కు వెల్​నెస్ ​సెంటర్ మార్చాలనే ప్రతిపాదన ముందుకు పడడంలేదు. రెండు రోజుల కింద మున్సిపల్ కమిషనర్ ​మంద మకరంద్​ను పెన్షనర్లు కలిసి మున్సిపల్ ఔట్ హౌస్​ను వెల్​నెస్ సెంటర్​కు కేటాయించాలని కోరారు. అయితే కమిషనర్ ​ఇప్పటికైతే ఏ నిర్ణయం వెల్లడించలేదు. ఇదైనా ముందుకు పడ్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు.