
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు 98.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఉపఎన్నికలో అభ్యర్థులు కవిత (TRS), సుభాష్ రెడ్డి (కాంగ్రెస్), లక్ష్మీనారాయణ (BJP) బరిలో నిలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం 824 మంది ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వారిలో 8 మంది కోలుకున్నారు. మిగతా 16 మంది బాధితుల్లో 14 మంది పీపీఈ కిట్లు ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయగా.. మరో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 12వ తేదీన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.