జోగురామన్నపై ఎంపీ అర్వింద్​ ఫైర్​

జోగురామన్నపై ఎంపీ అర్వింద్​ ఫైర్​
  • కేటీఆర్ ఓటీటీలో ది కాశ్మీర్ ఫైల్ చూడాలని సూచన

ఆదిలాబాద్, వెలుగు: జోగురామన్న మున్నూరుకాపుల గౌరవాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​మండిపడ్డారు. గురువారం ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా అర్వింద్​మాట్లాడుతూ బీజేపీ భరోసా కార్యక్రమంతో టీఆర్ఎస్ లో వణుకు పుట్టిందన్నారు.  అందుకే తమ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ముందు కేసీఆర్ రూ. 25 కోట్లతో సిటీ మొత్తం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టి చిల్లర రాజకీయాలు చేశారని, ఇక్కడ ఎమ్మెల్యేలు సైతం అదే చేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ లో ఓ వర్గానికి చెందిన 400 మంది పోలీస్​స్టేషన్ మీద దాడి చేస్తే ఎమ్మెల్యే నోరు మెదపలేదని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో హిందువుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే జనాభా నియంత్రణ బిల్లు, కామన్ సివిల్ కోడ్ అమల్లోకి రావాలన్నారు. కేటీఆర్ ఓటీటీలో ఏ సినిమా చూడాలని అడుగుతున్నారని.. ది కాశ్మీర్ ఫైల్ సినిమా చూడాలని సలహా ఇచ్చారు. కేంద్రం అన్నింట్లో జీఎస్టీ విధిస్తోందని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్.. అందులో సగానికి పైగా వివిధ పథకాల కింద మళ్లీ రాష్ట్రం తీసుకుంటోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ డిస్ట్రిక్ట్  ప్రెసిడెంట్ పాయల్ శంకర్, గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, నాయకులు సుహాసిని రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, లాలా మున్నా, అంకత్ రమేశ్, ఆదినాథ్, జోగు రవి, రాళ్లబండి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.