
ఢిల్లీ: స్వామీజీలు చెప్పారని ప్రభుత్వ బిల్డింగులను సీఎం కేసీఆర్ కూలగొట్టడం సరికాదని అన్నారు బీజేపీ నాయకులు, నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్. మున్సిపల్ ఎన్నికలను కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రివ్యూ చేసే అవకాశం లేకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా చెప్పారు. కేసీఆర్ కు దమ్మూ, ధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలని అన్నారు. బీజేపీని సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్తున్న కేసీఆర్… మరోవైపు బీజేపీ, మోడీ పేర్లు వింటేనే వణికిపోతున్నారని అన్నారు. కూతురినే గెలిపించుకోలేని ఆయన భవిష్యత్తులో పార్టీని ఏం గెలిపిస్తారని చెప్పారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ: బండి సంజయ్
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ బలోపేతం అవుతుందని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా మంది అప్లైయ్ చేసుకున్నా వారికి ఇండ్లను మంజూరు చేయలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి చెప్పే టీఆర్ఎస్ పార్టీ వాళ్లు… అసలు రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారో చెప్పాలని కోరారు.