దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ : ఎంపీ అర్వింద్​

దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ : ఎంపీ అర్వింద్​

జగిత్యాల, వెలుగు : దేశాన్ని దోచుకునేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోళ్లవాగు ఎంపీ పరిశీలించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భైంసా పట్టణం రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. హిందుత్వం కోసం పోరాడేవాళ్లను సీఎం కేసీఆర్ జైళ్లలో వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడతామని, అందుకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉందన్నారు. కాషాయ ఉద్యమం మారుమూల గ్రామాల నుంచే మొదలైందని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడుతున్నట్లు చెప్పారు. 

రోళ్లవాగు కట్ట తెగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రిపేర్లు చేపట్టకపోవడం కేసిఆర్ పాలనకు నిదర్శనమన్నారు. రూ.60 కోట్లతో చేపట్టిన పనులు రూ.130 కోట్లకు పెంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వారం రోజుల్లో నాట్లు వేసే ప్రక్రియ పూర్తికావస్తున్నప్పటికీ  ఇప్పటివరకు యాసంగి పంటకు నీరివ్వలేదని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకుముందు జగిత్యాల పట్టణంలో నిర్వహించిన బీజేపీ యువ మోర్చా జిల్లా శిక్షణ తరగతుల్లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కు ఎంపీ నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణరావు, జగిత్యాల నియోజవకర్గ నేత పన్నాల తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, అసెంబ్లి కన్వీనర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.